మల్లన్నకూ మోసం! | Chandrababu Naidu govt gives green signal to mining in Mallaiah Kondalu | Sakshi
Sakshi News home page

మల్లన్నకూ మోసం!

Jun 30 2026 5:08 AM | Updated on Jun 30 2026 5:08 AM

Chandrababu Naidu govt gives green signal to mining in Mallaiah Kondalu

రాయలసీమలోని ప్రసిద్ధ శైవక్షేత్రం మల్లయ్య కొండల్లో మైనింగ్‌కు చంద్రబాబు సర్కారు పచ్చజెండా

మల్లయ్యకొండ సముదాయంలోని సదుంకొండ ఏపీఎండీసీకి సౌత్‌ వెస్ట్‌ మైనింగ్‌ కంపెనీకి శివపురం కొండ కేటాయింపు 

మైనింగ్‌కు సర్వే, అన్వేషణ ప్రక్రియ ప్రారంభం 

తిరుమలకు ఏడు కొండల్లాగే మల్లయ్యకు మూడు కొండలు 

పవిత్ర కొండల్లో ఐరన్‌ ఓర్‌ తవ్వకాలకు అనుమతివ్వడంపై స్థానికులు, భక్తుల ఆందోళన 

6,700 హెక్టార్ల రిజర్వు ఫారెస్టులో మైనింగ్‌పై పర్యావరణవేత్తల అభ్యంతరాలు  

సాక్షి, అమరావతి: ఏరు దాటేదాకా.. ఓడ మల్లన్న! ఏరు దాటాక.. బోడి మల్లన్న! ఇదీ సీఎం చంద్రబాబు తీరు! సూపర్‌ సిక్స్‌ హామీలను నెరవేర్చకుండా.. గతంలో ఉన్న పథకాలను సైతం ఎగరగొట్టి రాష్ట్ర ప్రజలను నిత్యం మోసగిస్తున్న సీఎం చంద్రబాబు ఆ శివయ్యను సైతం వదలకుండా నిర్భీతిగా వంచనకు పాల్పడుతున్నారు! తిరుమలకు ఏడుకొండలు ఎంత పవిత్రమో రాయలసీమలోని ప్రసిద్ధ శైవక్షేత్రం మల్లయ్యకొండను సైతం అంతే పవిత్రంగా భక్తులు విశ్వసిస్తుంటారు. అలాంటి మల్లయ్యకొండపై మైనింగ్‌ జరగనివ్వబోనని గతంలో నమ్మబలికిన చంద్రబాబు తాజాగా అక్కడ ఐరన్‌ ఓర్‌ మైనింగ్‌కు పచ్చజెండా ఊపారు. మల్లయ్యకొండను, రిజర్వు ఫారెస్టును తవ్వేసి యథేచ్ఛగా మైనింగ్‌కు చంద్రబాబు సర్కారు అనుమతించడంపై భక్తులు, పర్యావరణవేత్తలు, స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం మల్లయ్యకొండ సముదాయంలో భాగమైన సాధుకొండ, శివపురం కొండల్లో ఐరన్‌ ఓర్‌ మైనింగ్‌కు కాంపోజిట్‌ లైసెన్స్‌ కోసం చంద్రబాబు సర్కారు లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌ఓఐ) జారీ చేసింది. మరోవైపు సమీపంలోని శివపురం ఐరన్‌ ఓర్‌ బ్లాక్‌ను ప్రైవేట్‌ సంస్థకు కేటాయించడం ద్వారా ఆ ప్రాంతం మొత్తాన్ని మైనింగ్‌ జోన్‌గా మార్చే దిశగా అడుగులు వేస్తోంది.

రెండు బ్లాకులుగా విభజించి కాంపోజిట్‌ లైసెన్సులు 
సాధుకొండపై 900 హెక్టార్ల విస్తీర్ణాన్ని ఒక బ్లాక్‌గా విభజించి ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎండీసీ)కు కేటాయించారు. ఈ బ్లాక్‌కు నిర్వహించిన ఈ–వేలంలో ఏపీఎండీసీ ఖనిజ విలువపై 130.30 శాతం అత్యధికంగా బిడ్‌ దాఖలు చేసి ప్రిఫర్డ్‌ బిడ్డర్‌గా నిలిచింది. ప్రభుత్వం ఆ సంస్థ నుంచి రూ.1.50 కోట్ల పెర్‌ఫార్మెన్స్‌ సెక్యూరిటీ కట్టించుకుని ఖనిజ అన్వేషణకు లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ జారీ చేసింది. అదే కొండల సముదాయంలోని 626 హెక్టార్లలో శివపురం ఐరన్‌ ఓర్‌ బ్లాక్‌ కాంపోజిట్‌ లైసెన్స్‌ను సౌత్‌ వెస్ట్‌ మైనింగ్‌ లిమిటెడ్‌కు కేటాయించింది. ఈ సంస్థ 11.80 శాతం ఫైనల్‌ బిడ్‌ వేసి ఎల్‌ 1గా నిలవడంతో రూ.1.50 కోట్ల బ్యాంక్‌ గ్యారంటీ కట్టించుకుని ఎల్‌ఐఓ జారీ చేసింది. దీంతో మల్లయ్యకొండపై అధికారికంగా మైనింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది.

ఆధ్యాత్మిక, జీవ వైవిధ్యానికి ప్రతీక మల్లయ్య కొండ 
ప్రభుత్వం రెండు బ్లాకులుగా విభజించి టెండర్లు ఖరారు చేసినా నిజానికి అది మూడు కొండల సముదాయం. సాధుకొండ, మల్లయ్యకొండ, ఇనుముకొండ కలిసి ఒకే పవిత్ర శైవక్షేత్రం. ఇక్కడ పురాతన మల్లికార్జునస్వామి ఆలయం ఉంది. రాయలసీమలో శ్రీశైలం, శ్రీకాళహస్తి తర్వాత అత్యంత విశిష్టమైన శైవక్షేత్రంగా మల్లయ్యకొండ ప్రసిద్ధి చెందింది. ఏటా లక్షలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. మల్లయ్యకొండ సముదాయం సుమారు 6,700 హెక్టార్ల రిజర్వు ఫారెస్టులో విస్తరించి ఉంది. ఇందులో 1,550 హెక్టార్లలో మైనింగ్‌ కార్యకలాపాలకు చంద్రబాబు సర్కారు అనుమతించింది. ఈ కొండలు జీవవైవిధ్యానికి ప్రతీక. మైనింగ్‌ జరిగితే ఇక్కడ కొండల స్వరూపం, అటవీ సంపద, వన్యప్రాణులు, జలవనరులు దెబ్బ తింటాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

దోచుకునే యత్నాలను ఏళ్లుగా అడ్డుకున్న స్థానికులు
ఈ కొండను తొలిచి ఖనిజాన్ని దోచుకోవాలని జరి­గిన యత్నాలను స్థానికులు ఎప్పటికప్పుడు తిప్పికొ­డుతూ వచ్చారు. ఈ కొండల్లో వందల టన్నుల ఇ­ను­ప ఖనిజం ఉందని గతంలో కేంద్రం ప్ర­కటించింది. కిరణ్‌కు­మార్‌రెడ్డి ప్రభుత్వం ఇ­క్కడ మైనింగ్‌ చేయడానికి ప్రయత్నించింది. అప్ప­ట్లో జి­యో మైసూర్‌ సంస్థకు ఖనిజ అన్వేషణ కోసం లైసె­న్స్‌ మంజూరు చేసింది. తీవ్ర అభ్యంతరాలు వ్యక్త­­మవడం, ఆందోళనలు వెల్లువెత్తడం­తో ఆ సంస్థ పూ­ర్తి­స్థాయిలో అన్వేషణ చేయకుండా వెనుతిరిగింది. 

కొండలను రక్షిస్తానని నమ్మబలికిన బాబు 
మల్లయ్యకొండలో మైనింగ్‌ జరగనివ్వబోనని చంద్రబాబు  గతంలో ప్రకటించారు. భక్తుల విశ్వాస్వాలకు అనుగుణంగా ఈ కొండను రక్షిస్తానని నమ్మబలికారు. అందుకు విరుద్ధంగా ఇప్పుడు అత్యంత రహస్యంగా టెండర్ల ప్రక్రియ నిర్వహించి ఇటీవలే కాంపోజిట్‌ లైసెన్సులు మంజూరు చేశారు. స్థానికులు ఆందోళనకు దిగుతారని పసిగట్టి గుట్టుగా టెండర్లు పిలిచి ఖనిజాన్వేషణకు అనుమతివ్వడం గమనార్హం. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకే కాకుండా మల్లికా­ర్జునస్వామికి సైతం శఠగోపం పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మైనింగ్‌ను వ్యతిరేకిస్తూ స్థానికులు, శివభక్తులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. మల్లయ్యకొండపై మైనింగ్‌కు అనుమతి ఇవ్వడం అంటే పవిత్ర శైవక్షేత్రం, రిజర్వ్‌ ఫారెస్ట్‌పై, భక్తుల విశ్వాసాలపై దాడి చేయడమేనని మండిపడుతున్నారు.

ప్రకృతి ఒడిలో పరమ శివుడు
తంబళ్లపల్లె: రాయలసీమలోని పవిత్ర శైవక్షేత్రం మల్లయ్యకొండకు, విజయనగర సామ్రాజ్య వైభవానికి అవినాభావ సంబంధం ఉంది. మల్లయ్యకొండ ఆలయ అభివృద్ధి అంతా శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో జరిగిందని చరిత్రకారులు, శాసనాల ద్వారా తెలుస్తోంది. రాయలసీమలోని వివిధ ప్రాంతాలలో శైవ, వైష్ణవ క్షేత్రాలను అభివృద్ధి చేసిన రాయలవారు తంబళ్లపల్లె కొండల మధ్య కొలువైన ఈ ఆలయాన్ని ప్రత్యేక నిధులతో జీర్ణోద్ధరణ చేసినట్లు ప్రతీతి. చుట్టూ పచ్చని లోయలు, దట్టమైన అడవులు, మేఘాల అందాల మధ్య ఈ ఆలయ శిల్పకళా చాతుర్యం విజయనగర నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. విజయనగర రాజుల కాలంలో ఈ స్వామివారి నిత్య నైవేద్యాలు, అర్చనలు, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ కోసం వందలాది ఎకరాల భూములను దేవాలయ మాన్యాలుగా కేటాయించారు. వీటి ద్వారా వచ్చే ఆదాయంతోనే శతాబ్దాలుగా ఆలయ ధూపదీప నైవేద్యాలు సాగుతున్నాయి.


స్వయంభువు..
ఈ పవిత్ర క్షేత్రంలో పరమేశ్వరుడు శ్రీ మల్లికార్జున­స్వామిగా, అమ్మవారు భ్రమరాంబికా దేవిగా వెలసి భక్తుల కోర్కెలు తీరుస్తున్నారు. ఇక్కడి ప్రధాన శివలింగం కొండల మధ్య స్వయంభువుగా వెలిసింది. ఆలయ జీర్ణోద్ధ్ధరణ సమయంలో క్షేత్ర సంప్రదాయాల ప్రకారం కొన్ని మార్పులు జరిగాయి. కాలభైరవస్వామి ఇక్కడ క్షేత్రపాలకుడిగా కొలువై ఆలయాన్ని రక్షిస్తున్నట్లు భక్తుల నమ్మకం. భక్తులు కొండ అడుగున వెలిసిన వినాయకుడు, ఆంజనేయస్వామి ఆలయాలను దర్శించుకుని కొండ ఎక్కడం ప్రారంభిస్తారు. పైకి వెళ్లే మార్గంలో నెలమల్లేశ్వరస్వామి, ఏనుగు మల్లమ్మ, యేలక తీర్థం లాంటి పవిత్ర కోనేరులు, స్థలాలను దర్శిస్తూ ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు. కొండపై ప్రధాన ఆలయం వద్ద గౌరీ అమ్మవారి ఉపాలయం కూడా ఉంది. ప్రతి సోమవారం, కార్తీక మాసం, పౌర్ణమి రోజులతో పాటు మహాశివరాత్రి పర్వదినాన ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement