
బీబీబీ విధానంలో తాము ప్రాజెక్టు నిర్వహణకు సిద్ధంగా లేమని, తమ వద్ద విద్యుత్ నిల్వ(బ్యాంకింగ్) సామర్థ్యం లేదని ఏపీ ట్రాన్స్‌కో అభ్యంతరం తెలిపిన భాగం
యాక్సిస్‌తో అడ్డగోలు ఒప్పందానికి నిస్సిగ్గుగా సర్కారు సమర్థన
‘బీబీబీ’ విధానం వల్లే అధిక ధర అంటూ అసంబద్ధ వాదన
నిజానికి అదే ‘బీబీబీ’ విధానంలో యూనిట్ రూ.3.53కే ముందుకొచ్చిన రిలయన్స్
కానీ రూ. 4.60 యాక్సిస్‌కే చంద్రబాబు ఓటు..
గతంలో రూ. 2.49కు జగన్ సర్కార్ ఒప్పందం
సాక్షి, అమరావతి: అసలే చీకటి ఒప్పందం.. ఆపై అడ్డగోలు సమర్థన! విద్యుత్తు చట్టం 2003 సెక్షన్ 108 పేరుతో ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలిని బెదిరించి చీకటి ఒప్పందానికి సర్కారు ఆమోద ముద్ర!! యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి యూనిట్ ఏకంగా రూ.4.60 చొప్పున విద్యుత్తు కొనుగోలు ఒప్పందంపై అడ్డంగా దొరికిపోవడంతో కూటమి సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. వైఎస్ జగన్ హయాంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’ నుంచి కారుచౌకగా యూనిట్ రూ.2.49 చొప్పున కొనుగోలు ఒప్పందం చేసుకుంటే రూ.లక్ష కోట్ల భారమంటూ కూటమి నేతలు, దాని అనుకూల మీడియా తప్పుడు ప్రచారం చేశాయి.
ఇప్పుడు ఏకంగా యూనిట్ రూ.4.60 చొప్పున కొనేందుకు సిద్ధమై అది చాలా గొప్ప పని అంటూ నిస్సిగ్గుగా సమర్ధించుకోవడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. యాక్సిస్ పవన–సౌర హైబ్రీడ్ ప్రాజెక్టు నుంచి 400 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను ఏపీఎస్పీడీసీఎల్ పాతికేళ్ల పాటు యూనిట్ ఏకంగా రూ.4.60 చొప్పున కొనుగోలుకు పీపీఏ చేసుకోవడం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ఈ ఒప్పందాలను రద్దు చేయగా, నాడు ఏపీఈఆర్‌సీ సైతం తిరస్కరించిన ఒప్పందాన్ని కూటమి సర్కారు మళ్లీ తెరపైకి తెచ్చి 108 సెక్షన్ పేరుతో బెదిరించి ఆమోదింపచేసుకుంది.
ఈ అడ్డగోలు ఒప్పందాన్ని ‘సాక్షి’ బహిర్గతం చేయడంతో రాష్ట్ర ప్రజలు నివ్వెరపోయారు. యాక్సిస్‌తో ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రతిపక్షాలు, మేధావులు, విద్యుత్ రంగ నిపుణులు, సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ చార్జీల బాదుడును రద్దు చేయాలని, యాక్సిస్ తదితర బడా కంపెనీలతో కుదుర్చుకున్న అవినీతి ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో సోమవారం ప్రజాభేరి కార్యక్రమంలో సంతకాలను సేకరించారు.
తక్కువ ధరకే రిలయన్స్ ‘బీబీబీ’..
యాక్సిస్ ఎనర్జీతో అధిక ధరకు కుదుర్చుకున్న ఒప్పందాన్ని సమరి్ధంచుకునేందుకు ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రయతి్నంచారు. అది హైబ్రీడ్ పైలట్ ప్రాజెక్టు అని.. బండ్లింగ్, బ్యాలెన్సింగ్, బ్యాంకింగ్ (బీబీబీ) విధానంలో ఏర్పాటవుతున్న తొలి ప్రాజెక్టు కాబట్టి ఆ మేరకు ధర కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు.
కానీ సెకీ నిర్వహించిన వేలంలో 930 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పి యూనిట్ రూ.3.53 చొప్పున అందించేందుకు రిలయన్స్ పవర్ ముందుకొచి్చంది. ఇదే బీబీబీ విధానంలో రోజూ నాలుగు గంటల పాటు పీక్ అవర్స్‌లో విద్యుత్‌ను ఇస్తామని రిలయన్స్ చెప్పింది. అయినప్పటికీ తక్కువ ధరకు అందించే రిలయన్స్‌ను కాదని యూనిట్ రూ.4.60కి యాక్సిస్ నుంచే తీసుకోవడానికి కారణం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
‘సెకీ’ విద్యుత్‌పై ‘ఎల్లో’ మీడియా దు్రష్పచారం..
రైతులకు పగటి పూట 9 గంటలపాటు ఇచ్చే ఉచిత విద్యుత్ పథకాన్ని దీర్ఘకాలికంగా అమలు చేసేందుకు కేంద్ర సంస్థ సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను కారుచౌకగా యూనిట్ రూ.2.49కే కొనుగోలు చేసేలా గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ ప్రతిపాదన సెకీ నుంచే వచి్చంది. అంతేకాకుండా ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ (ఐఎస్‌టీఎస్) చార్జీల నుంచి పూర్తి మినహాయింపు కల్పిచింది.
ఇంత మంచి ఒప్పందాన్ని చేసుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్‌ను అభినందించాల్సిందిపోయి చంద్రబాబు, టీడీపీ అనుబంధ కరపత్రికలు దు్రష్పచారానికి పాల్పడ్డాయి. ఈ కుట్రలన్నిటినీ ఏపీఈఆర్‌సీ పటాపంచలు చేసింది. సెకీతో ఒప్పందం సక్రమమేనని మండలి తేల్చి చెప్పింది. ఇప్పుడు యాక్సిస్‌కు భారీ ధర చెల్లిస్తూ టీడీపీ కూటమి సర్కారు చేసుకున్న ఒప్పందంపై ఎల్లో మీడియా కిమ్మనకపోవడం గమనార్హం.