రాష్ట్రాన్ని దివాలా దిశగా తీసుకుపోతున్న బాబు సర్కారు
2026–27 తొలి త్రైమాసిక సొంత పన్ను రాబడి రూ.28,435 కోట్లు
అదే మూడునెలల్లో అప్పులు రూ.33,612 కోట్లు
అప్పుల్లో మూలధన వ్యయం కేవలం రూ.8,088 కోట్లే
కేంద్ర గ్రాంట్లు బడ్జెట్ అంచనాల్లో 6.82 శాతమే
మూడునెలల్లో రెవెన్యూ లోటు 107.55 శాతం
ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక బడ్జెట్ కీలక సూచికలను వెల్లడించిన కాగ్
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో అప్పులే అప్పులు.. సొంత పన్ను రాబడులను మించి అప్పులు చేస్తున్నట్లు కాగ్ నివేదిక గణాంకాలు స్పష్టం చేశాయి. ఆదాయానికి మించి అప్పులు చేయడం అంటే రాష్ట్రాన్ని చంద్రబాబు సర్కారు ఆర్థికంగా దివాలా దిశగా తీసుకుపోతోందని స్పష్టమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్) బడ్జెట్ కీలక సూచికలను కాగ్ శుక్రవారం వెల్లడించింది. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా రాబడిని మినహాయించి రాష్ట్ర సొంత పన్నులు రాబడులు జూన్ వరకు రూ.28,435 కోట్లు వచ్చినట్లు కాగ్ నివేదిక పేర్కొంది.
ఈ మూడు నెలల్లోనే చంద్రబాబు సర్కారు బడ్జెట్‌లో చేసిన అప్పు రూ.33,612 కోట్లని తెలిపింది. అంటే సొంత పన్ను రాబడులకన్నా రూ.5,177 కోట్లు ఎక్కువ అప్పు చేసినట్లు తేల్చింది. మరోపక్క చేసిన అప్పుల్లో మూలధన వ్యయం దారుణంగా ఉందని వెల్లడించింది. మూడు నెలల్లో ఏకంగా రూ.33,612 కోట్లు అప్పుచేస్తే మూలధన వ్యయం కేవలం రూ.8,088 కోట్లేనని తెలిపింది. బడ్జెట్ అంచనా వ్యయంలో ఇది కేవలం 16.61 శాతం మాత్రమేనని కాగ్ నివేదిక పేర్కొంది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన అప్పుల్లో మూడునెలల్లోనే 44.30 శాతం అప్పు చేసేసినట్లు తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో రావానన నిధులు గణనీయంగా తగ్గిపోయినట్లు వెల్లడించింది. కేంద్రం నుంచి గ్రాంట్లు రూపంలో వస్తాయని బడ్జెట్‌లో ప్రతిపాదించినదాన్లో తొలి త్రైమాసికంలో 6.82 శాతం మాత్రమే వచ్చినట్లు తెలిపింది. కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ చంద్రబాబు గ్రాంట్ల రూపంలో ఆశించినస్థాయిలో నిధులు రాబట్టలేకపోతున్నారని ఇది స్పష్టం చేస్తోంది. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే రెవెన్యూ లోటు బడ్జెట్ అంచనాలను మించిపోయింది.

ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లకు పరిమితం అవుతుందని అంచనా వేశారు. అయితే జూన్ నాటికే రెవెన్యూ లోటు రూ.23,663 కోట్లకు చేరినట్లు కాగ్ వెల్లడించింది. ఇది బడ్జెట్ అంచనాలను మించి 107.55 శాతానికి చేరింది. మరోపక్క ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్న దాన్లో తొలి త్రైమాసికంలోనే 44.30 శాతానికి చేరింది. ఈ మూడు నెలల్లో కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలను మించి ఆంధ్రప్రదేశ్ అప్పుచేసింది.


