బరితెగించిన బీటెక్‌ రవి.. విద్యార్థుల మృతిపై అసత్య ప్రచారం | BTech Ravi makes controversial remarks regarding the students deaths | Sakshi
Sakshi News home page

బరితెగించిన బీటెక్‌ రవి.. విద్యార్థుల మృతిపై అసత్య ప్రచారం

Jun 22 2026 3:40 PM | Updated on Jun 22 2026 4:09 PM

BTech Ravi makes controversial remarks regarding the students deaths

వైఎస్సార్‌,సాక్షి: చక్రాయపేట మండలంలో నిన్న జరిగిన ఘోర విషాదంపై  టీడీపీ నేత బీటెక్‌ రవి బరితెగింపు వ్యాఖ్యలు చేశారు. ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థులు ఇసుక గోతుల్లో పడి చనిపోతే.. కావాలనే ఆ విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారని అత్యంత హేయంగా మాట్లాడారు. బాధిత కుటుంబాలను పరామర్శించాల్సింది పోయి.. వారి ఆత్మస్థైర్యం దెబ్బతేనేలా కారుకూతలు కూశారు. దీంతో బీటెక్‌ రవి వ్యాఖ్యలపై ఆ గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే నిన్న ఆదివారం (జూన్‌21) నాడు చక్రాయిపేటలో  బంధువుల ఇంటికి వచ్చిన  అన్నదమ్ములైన జయంత్ రెడ్డి (17), రాజవర్ధన్ రెడ్డి (15)లు సరదాగా ఈత కొట్టేందుకు పాపాగ్ని నదికి వెళ్లారు.  అయితే అక్కడ ఇసుకకోసం తవ్విన గుంతల్లో  చిక్కుకుని ప్రాణాలు విడిచారు. పిల్లలు కనిపించకుండా పోవడంతో గాలించిన స్థానికులకు, చాలా సేపటి తర్వాత వారి మృతదేహాలు లభ్యమయ్యాయి.ఈ దారుణానికి చక్రాయపేట మండలంలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ ఇసుక దందాయే కారణమని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బీటెక్‌ రవి అక్రమ దందాలో 
కాగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అనుచరులు ఈ అక్రమ వ్యాపారాన్ని నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భారీ జేసీబీ యంత్రాలను నదీ గర్భంలోకి దించి ఇష్టారీతిన ఇసుకను తవ్వేస్తున్నారు. దీనివల్ల నది లోపల ప్రమాదకరమైన భారీ గోతులు ఏర్పడ్డాయి. అలా తవ్విన ఇసుకను చక్రాయపేట ప్రాంతం నుండి యథేచ్ఛగా బెంగళూరుకు తరలిస్తూ కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా అక్రమ ఇసుక తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

కలెక్టర్‌ ఆదేశాలు భేఖాతర్‌
అయినప్పటికీ అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు, వారి అనుచరులు ఈ ఆదేశాలను పూర్తిగా బేఖాతరు చేశారు. కలెక్టర్ ఆదేశాలను సైతం లెక్కచేయకుండా పాపాగ్ని నదిని ఇష్టమొచ్చినట్లు తోడేస్తున్నారు. ఇసుక మాఫియా ఆగడాలపై స్థానిక ప్రజలు, పర్యావరణ ప్రేమికులు పలుమార్లు జిల్లా కలెక్టర్‌కు అధికారికంగా ఫిర్యాదులు కూడా చేశారు. అయినా అధికారుల నుండి ఆశించిన స్థాయిలో చర్యలు లేకపోవడం, ఇసుక దందా ఆగకపోవడం వల్లే ఈరోజు ఈ ఘోర ప్రమాదం జరిగిందని బాధితులు మండిపడ్డారు. 

అమాయక విద్యార్థుల మృతికి కారణమైన అక్రమ ఇసుక క్వారీ నిర్వాహకులపై, దానికి సహకరిస్తున్న టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కాగా తాజాగా బాధితుల కుటుంబాలను  పరామర్శించాల్సింది పోయి ముక్కుపచ్చలారని ఇద్దరు విద్యార్థులపై మృతిపై  టీడీపీ నేత బీటెక్ రవి ఇష్ఠారీతిన వ్యాఖ్యానించడం వారి కుటుంబసభ్యులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement