అహోబిలం క్షేత్రంలోనూ ‘బి’ ట్యాక్స్‌ | Bhuma Akhilapriya and her husband Bhargavram interference in the tollgate auction | Sakshi
Sakshi News home page

అహోబిలం క్షేత్రంలోనూ ‘బి’ ట్యాక్స్‌

Jun 29 2025 5:08 AM | Updated on Jun 29 2025 5:08 AM

Bhuma Akhilapriya and her husband Bhargavram interference in the tollgate auction

లక్ష్మీనరసింహుని క్షేత్రం టోల్‌గేట్‌ వేలంలో అధికార పార్టీ ఇష్టారాజ్యం  

పంచాయతీకి రూ.20 లక్షలే.. ‘బి’ ట్యాక్స్‌ మాత్రం రూ.60 లక్షలు  

సాక్షి టాస్క్ ఫోర్స్ : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి  కొ­లు­­వైన ప్రసిద్ధ క్షేత్రంలో గ్రామ పంచాయతీ ప్రధాన ఆదాయ వనరు అయిన టోల్‌గేట్‌ వేలంలో టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్‌ జోక్యం మితిమీరింది. దీనివల్ల పంచాయతీకి రావాల్సిన ఆదాయం పూర్తిగా పడిపోగా.. భూమా ట్యాక్స్‌ (‘బి’ ట్యాక్స్‌) భారీగా పెరిగింది. 

పంచాయ­తీ­కి, అహోబిలం క్షేత్ర అభివృద్ధికి చేరాల్సిన ఆదా­యం అధికార పార్టీ నాయకుల జేబుల్లోకి చేరుతోందనే చర్చ జరుగుతోంది. డీఎల్‌పీఓ రాంబాబు అధ్యక్షతన అహోబిలం టోల్‌గేట్‌ (అహోబిలం క్షేత్రానికి వచ్చే భక్తుల వాహనాల నుంచి రుసుము వసూలు­కు) శనివారం వేలం నిర్వహించారు. వేలంలో పాల్గొనేందుకు ఇతరులెవరూ రాకుండా చక్రం తిప్పిన టీడీపీ నేత రూ.20.31 లక్షలకే దక్కించుకున్నారు.   

రూ.కోటి వస్తుందనుకుంటే..  
వేలం సమయంలో పాటదారులంతా ఎంత రింగ్‌ అయినా టీడీపీలోని మూడు వర్గాలతో పాటు వైఎస్సార్‌సీపీ వర్గీయులు పోటాపోటీగా పాడుతారనే చర్చ జరిగింది. గత ఏడాది ‘బి’ ట్యాక్స్‌ రూ.40 లక్షలు, అధికారులకు రూ.10 లక్షలు, పంచాయతీకి రూ.19.30 లక్షలు చెల్లించినా రూ.కోటి వరకు కాంట్రాక్టర్‌కు మిగిలిందని అంచనా. దీంతో ఈ ఏడాది టీడీపీ నేతలు మూడు గ్రూపులుగా ఏర్పడి వేలంలో పాల్గొనేందుకు పోటీపడ్డారు. 

ఇది చూసిన గ్రామస్తులు ఈ ఏడాది రూ.కోటి వరకు ఆదాయం వస్తుందని భావించారు. అయితే వేలంలో పాల్గొనేందుకు వెళ్లిన టీడీపీ నేతలకు, అక్కడి అధికారులకు ఫోన్లు రావడంతో ‘అన్న ఎంత చెబితే అంతే’ అని నిమిషాల్లో వేలం ముగించారు.  

అప్పుడలా.. ఇప్పుడిలా..  
దశాబ్దాలుగా అహోబిలం టోల్‌గేట్‌ వేలం పాటలు నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారంతా వేలంలో బహిరంగంగా పాల్గొనడం ఆనవాయితీ. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు నిర్వహించిన వేలంలో సుమారు రూ.40 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ఎక్కడైనా.. ఎప్పుడైనా ఏటా వచ్చే ఆదాయం కంటే కనీసం 20 శాతం అదనంగా పెంచి పాట పెట్టడం ఆనవాయితీ. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.40 లక్షలు ఉన్న వేలం పాటను రూ.19 లక్షల పైగా తగ్గించి.. అధికారులు టీడీపీ నాయకులకు కట్టబెట్టడం చర్చనీయాంశమైంది. ఈ ఏడాదైనా ఆదాయం పెరుగుతుందనుకుంటే రూ.లక్ష పెంచి మమ అనిపించారు.  

‘బి’ ట్యాక్స్‌ రూ.60 లక్షలకు పైనే! 
పంచాయతీకి వచ్చే ఆదాయం ఎంత వీలైతే అంత తగ్గించాలని అధికారులకు హుకుం జారీ చేయడంతో రూ.20 లక్షలతో మొదలు పెట్టి రూ.21 లక్షలకు వేలం ముగించారు. ఇందుకు వేలంలో పెద్దఎత్తున పాటదారులు పాల్గొంటున్నట్టు షో చేసి మొత్తం మీద గత ఏడాది కంటే రూ.లక్ష వరకు పెంచి మమ అనిపించారు. కాగా.. వేలంలో పాల్గొన్న మూడు గ్రూపులకు చెందిన నాయకులను ఎమ్మెల్యే ఇంటికి పిలిపించుకుని ‘ఇప్పుడు చెప్పండి. 

ఎవరు ఎంతిస్తారో’ అని ఇంటివద్దే వేలం పెట్టడంతో ‘బి’ ట్యాక్స్‌ కింద రూ.62 లక్షలు ఇచ్చేందుకు ఓ వర్గం ఒప్పందం చేసుకోగా.. మరో వర్గం ఒక రోజు అవకాశం ఇస్తే ఆలోచించుకుని అంతకంటే ఎక్కువే ఇస్తామని చెప్పుకుని ఇంటికి వచి్చనట్టు సమాచారం. కాగా.. ఇదంతా సంబంధిత అధికారులతో పాటు పోలీసు­లకు అందరికీ తెలిసినా చేష్టలుడిగి చూడటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.  

ఆదాయం రాకుండా అడ్డుకున్నారు  
గ్రామ పంచాయతీకి ఆదా­యం రాకుండా అధికారుల సాక్షిగా అడ్డుకున్నారు. అధికార పార్టీ కి చెందిన వారిని 15 మందిని వేలం కేంద్రానికి పంపించారు. వేరే వారిని ఇద్దరినే లోపలకు పంపించారు. వేలంలో పోటాపోటీగా పాల్గొనేందుకు వచ్చిన వారిని మాత్రం లోనికి అనుమతించకుండా వెనక్కి పంపడం ఎంతవరకు సబబు. ఈ ఏడాదిలో జరిగిన రెండు వేలం పాటల్లో సుమారు రూ.80 లక్షలు పంచాయతీకి చెందిన ఆదాయాన్ని దోచు­కోవడం జరిగింది. సంబంధిత అధికారులు, పోలీసులు ఆలోచించాలి. – గంగుల బిజేంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఆళ్లగడ్డ 

Advertisement
 
Advertisement
Advertisement