● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు
కాటసాని రాంభూపాల్‌రెడ్డి
నంద్యాల(న్యూటౌన్): స్కీం వర్కర్లకు నెలకు రూ. 26వేలు కనీస వేతనం ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ, పెన్షన్ తదితర సౌకర్యాలు కల్పించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, వీఓఏలు, మధ్యాహ్న భోజన కార్మికులు నూనెపల్లె ఓవర్ బ్రిడ్జి నుంచి భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకొని ధర్నా నిర్వహించారు. ధర్నా చేస్తున్న వారికి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి మద్దుతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల్లో పని చేస్తూ పనిభారం ఎక్కువై డిమాండ్లను పరిష్కరించాలని కార్మికులు అడిగితే చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. స్కీం వర్కర్లకు సంక్షేమం, ఆరోగ్యం కావాలంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం అమలు చేయాలన్నారు.
సంక్షేమ పథకాలు ఇవ్వాలి
ధర్నాను ఉద్దేశించి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, అధ్యక్షులు ఏసురత్నం, వీఓఏల సంఘం రాష్ట్ర కోశాధికారి మిట్నాల తిరుపతయ్య మాట్లాడారు. స్కీం వర్కర్లకు సంక్షేమ పథకాలు వర్తింపజేయకపోవడం అన్యాయమన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వేతనాలు పెంచుతామని చెప్పి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. నవచేతన యాప్ ద్వారా పని భారం పెంచడం, పెండింగ్ డీఏ బిల్లులు చెల్లించకపోవడం దారుణమన్నారు. ఆశా కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు 20 ఏళ్లుగా కనీస వేతనం లేకుండా పని చేయాల్సి వస్తోందన్నారు. ఐకేపీలు, వీఓఏలు ఉద్యోగ భద్రత లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రూ.10లక్షల గ్రూప్స్ ఇన్సురెన్స్ అమలు చేయాలని, రాజకీయ వేధింపులు నిలిపి వేయాలని కోరారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నిర్మలమ్మ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కేఎండీ గౌస్, రాజశేఖర్, మద్దులు, వెంకటలింగం, బాలవెంకట్, రాంనాయక్, రత్నమయ్య, శంకరయ్య, సునిత, నాగారాణి, హరిత, తదితరులు పాల్గొన్నారు.


