మహానంది: రాష్ట్రంలో వర్షాలు కురవాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుతూ మహానందిలో రెండోరోజు శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర్ అవధాని, హనుమంతుశర్మ, నాగేశ్వరశర్మ, శాంతారామ్ భట్, రుత్వికులు ఉదయం నుంచి రాత్రి వరకు శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. త్రయాహ్నిక వరుణయాగంలో భాగంగా వరుణ, పర్జన్య కలశార్చనలు, మహాన్యాస రుద్రాభిషేకం, రుద్రహోమం, వరుణానువాక హో మాలు చేపట్టారు. రుద్రగుండం (పెద్దకోనేరు)లో వరుణజపాలు చేస్తుండగా వర్షం కురవడం శుభసూచకమని వేదపండితులు రవిశంకర్ అవధాని అన్నారు. వర్షం కురవాలని పూజలు చేస్తున్న తీరుపై అందరూ హర్షించారు.


