నంద్యాల(అర్బన్): తాత్కాలికంగా సమ్మెను విరమించినట్లు దస్తావేజు లేఖరుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఫారూక్, రమేష్‌లు తెలిపారు. స్థానిక ఎన్‌కే రోడ్డు నుంచి ర్యాలీగా వచ్చి నంద్యాల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన తెలిపారు. అనంతరం ఎస్‌ఆర్‌ఓ హాజీమియాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో దస్తావేజు లేఖరుల సమ్మెతో పనులు నిలిచి పోయాయన్నారు. ప్రజల అసౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని సమ్మెను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు తెలిపారు.
శ్రీశైలానికి పెరుగుతున్న వరద ప్రవాహం
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి రోజురోజుకు వరద ప్రవాహం పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రం సమయానికి జూరాలప్రాజెక్ట్ నుంచి 1,31,094 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి తెలంగాణాలోని కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,600 క్యూసెక్కులను విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 54.3495 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటి మట్టం 834.40 అడుగులకు చేరుకుంది. డ్యాం పరిసర ప్రాంతాలలో 18.20 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
నందిని తాకిన నీరు!
కొత్తపల్లి: జూరాల ప్రాజెక్ట్ నుంచి విడుదలవుతున్న నీరు శుక్రవారం సాయంత్రం ప్రాచీన సంగమేశ్వరాలయ ప్రవేశ ద్వారం ముందు ఏర్పాటుచేసిన నంది విగ్రహం వద్దకు చేరాయి. ఇదేవిధంగా వరద ప్రవాహనం కొనసాగితే శనివారం తెల్లవారు జాము సంగమేశ్వరస్వామి గర్భాలయంలోకి వరద జలాలు చేరుకొంటాయి. దీంతో ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ వేపధారు శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. కాగా.. శుక్రవారం సాయంత్రానికి శ్రీశైలం జలాశయం నీటిమట్టం 832 అడుగులకు చేరుకుంది.
అన్నప్రసాద వితరణకు
రూ.2 లక్షల విరాళాలు
శ్రీశైలంటెంపుల్: భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి శుక్రవారం పలువురు భక్తులు రూ.2 లక్షల విరాళాలు అందించారు. హైదరాబాద్‌కు చెందిన బి.మైథిలి రూ.లక్ష విరాళాన్ని, అలాగే విజయవాడకు చెందిన పి.హరికిరణ్ రూ.1,00,001 విరాళాన్ని పర్యవేక్షకులు కె.అయ్యన్నకు అందజేశారు. విరాళాలను అందించిన దాతలకు దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను, రశీదును అందజేసి సత్కరించారు.
గడివేములలో
ఎన్‌ఐఏ విచారణ
గడివేముల: నంద్యాల జిల్లా మండల కేంద్రమైన గడివేముల గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్ నామాల జయమ్మ(40) 2023 సంవత్సరంలో మృతి చెందింది. అయితే ఆమె కుటుంబంలో ఇంకా ఎవరైనా ఉద్యమంలో ఉన్నారేమో తెలుసుకునేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ(ఎన్‌ఐఏ) సిబ్బంది శుక్రవారం జయమ్మ తల్లి గువ్వల పెద్ద ఓబులమ్మ(70), కుటుంబ సభ్యులను సాధారణ విచారణ చేశారు. మిగతా చోట్ల నక్సలైట్లు ఉంటే సమాచారం అందించాలని కోరారు. అనంతరం జయమ్మ భర్త బండిఆత్మకూరు మండలం పరమటూరుకు చెందిన నామాల భాస్కర్(45) ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు.
డిగ్రీ సప్లిమెంటరీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో మార్చి/ఏప్రిల్ నెలల్లో నిర్వహించిన డిగ్రీ 2, 4వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల రీ వాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఫలితాలు https://rayalas eemauniversity.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు.


