ఇంటికి నిప్పు.. బాలికకు తీవ్రగాయాలు
అనంతపురం: బేతాపల్లిలో తొండ తెచ్చిన తంటా ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవకు దారి తీసింది. ఆవేశంలో ఇంటికి నిప్పు పెట్టడంతో బాలిక తీవ్రంగా గాయపడింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు... గుత్తి మండలం బేతాపల్లికి చెందిన రామాంజనేయులు, శ్రీనివాసులు వరుసకు అన్నదమ్ములు. శుక్రవారం రాత్రి వీరు మద్యం మత్తులో ఘర్షణ పడ్డారు.
ఈ క్రమంలో రామాంజనేయులు తన అన్న శ్రీనివాసులుపై తొండ విసరగా.. అది అతడి మెడను కరిచింది. తనపై చేతబడి చేసేందుకే తొండను విసిరాడని భావించిన శ్రీనివాసులు కోపంలో రామాంజనేయులు ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ఇంట్లో ఉన్న రామాంజనేయులు కుమార్తె లక్ష్మి తీవ్రంగా గాయపడగా... కుమారుడు శివ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మిని గుత్తి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించిన అనంతరం వైద్యుల సూచన మేరకు అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


