
కృష్ణా: ఓ మహిళా యాచకురాలు బిక్షాటన చేస్తూ ఏకంగా రూ.1.83 లక్షలు పోగు చేసింది. ఆ మొత్తాన్ని ఓ ఆలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణకు చెందిన వృద్ధురాలు రంగమ్మ కొన్నేళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రం రాయచూరుకు చేరుకుంది. ఆమెకు ఎవరూ లేకపోవడంతో బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంది. తన అవసరాలను తీర్చుకోగా మిగిలిన డబ్బును కొద్ది కొద్దిగా జమ చేస్తూ వచ్చింది.
ఇలా కొన్నేళ్లపాటు జమ చేయగా.. మొత్తం రూ.1.83 లక్షలు అయ్యింది. ఈ మొత్తాన్ని రాయచూర్ జిల్లాలోని బిజనగేరి ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చి దేవుడిపై తన భక్తిని చాటుకుంది. రూ.కోట్లు సంపాయిస్తున్న వారు సైతం రూ.వెయ్యి విరాళం ఇచ్చేందుకు వెనకాడే ఈ రోజుల్లో ఏళ్ల తరబడి రూపాయి రూపాయి కూడబెట్టుకొని రూ.లక్షలు జమ చేసి ఆలయానికి విరాళంగా ఇవ్వడంపై ఇరు రాష్ట్రాల ప్రజలు రంగమ్మ పెద్ద మనస్సును కొనియాడుతున్నారు.