సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా వెలుగులోకి వచ్చిన పాక్ హనీ ట్రాప్ కేసులో దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ (PIOs) నుంచి భారత్‌లోని అనుమానితులకు క్రిప్టోకరెన్సీ మార్గంలో డబ్బులు చేరినట్లు ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నిధుల ప్రవాహం వెనుక ఉన్న వ్యక్తులు, మధ్యవర్తులు ఎవరు? ఎవరెవరికి ఎంత మొత్తం చేరింది? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
‘ఆపరేషన్ ఫైర్‌వాల్-2026’లో భాగంగా పాక్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌కు సంబంధించిన వ్యవహారాన్ని ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ వెలుగులోకి తీసుకొచ్చింది. మొత్తం 18 మంది అనుమానితులు దర్యాప్తు పరిధిలో ఉండగా.. వారిలో 13 మంది నేవీకి చెందినవారేనని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేశారు. విచారణలో పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ నకిలీ సోషల్ మీడియా ప్రొఫైళ్లతో భారత రక్షణ సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకుని.. అనంతరం వాట్సాప్‌కు సంభాషణలను మార్చినట్లు వెల్లడైంది. స్నేహం, ప్రేమ పేరుతో దగ్గరవుతూ.. ఆ తర్వాత హనీ ట్రాప్, ఆర్థిక ప్రలోభాల ద్వారా కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.
క్రిప్టో రూపంలో డబ్బులు..
ఈ వ్యవహారంలో మరో కీలక అంశం డబ్బు చెల్లింపుల విధానం. పాక్ ఏజెంట్ల నుంచి వచ్చిన నిధులను క్రిప్టోకరెన్సీ మార్గంలో, మధ్యవర్తులు లేదా ‘ట్రేడర్ల’ ద్వారా అనుమానితులకు చేరవేసినట్లు దర్యాప్తులో తేలినట్లు ఏపీ పోలీసులు తెలిపారు. భారత సిమ్ కార్డులు, వాట్సాప్ యాక్టివేషన్ కోసం అవసరమైన OTPలను సమకూర్చే నెట్‌వర్క్‌కు కూడా చెల్లింపులు జరిగినట్లు అనుమానిస్తున్నారు. దీంతో పాక్ ఏజెంట్లు-భారతీయ అనుమానితుల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై కౌంటర్ ఇంటెలిజెన్స్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ క్రిప్టో వాలెట్ల ద్వారా బదిలీ అయింది? ఎవరెవరికి చేరింది? ఆ డబ్బుకు ప్రతిగా ఎలాంటి సమాచారం అందించారు? అనే కోణాల్లో ఆధారాలు సేకరిస్తున్నారు.
మరో ఆరుగురిపై విచారణ?
ఇప్పటికే కేసులో గుర్తించిన అనుమానితుల సంఖ్య 18కు చేరగా.. మిగిలిన వ్యక్తుల పాత్రపై విచారణ కొనసాగుతోంది. తాజా దర్యాప్తులో మరో ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అధికారులు ప్రతి అనుమానితుడి డిజిటల్ కమ్యూనికేషన్, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. దర్యాప్తులో స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపుతున్నారు. డిలీట్ చేసిన చాట్స్, కాల్ వివరాలు, ఫొటోలు, వీడియోలు, ఫైల్ ట్రాన్స్‌ఫర్లు, సోషల్ మీడియా కార్యకలాపాలు వంటి డిజిటల్ ఆధారాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా పాక్ ఏజెంట్లతో ఎవరెవరు సంప్రదింపులు జరిపారు? ఎలాంటి సమాచారం మార్పిడి జరిగింది? అనే విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

విశాఖే ఎందుకు టార్గెట్?
విశాఖపట్నంలో ఈస్టర్న్ నేవల్ కమాండ్ ప్రధాన కార్యాలయం ఉండటంతో పాటు కీలక నౌకాదళ ఆస్తులు, వ్యూహాత్మక సంస్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నౌకలు, జలాంతర్గాముల కదలికలు, వాటి సంఖ్య, ఫొటోలు, వీడియోలు, కమాండింగ్ అధికారుల వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అక్టోబర్ 1న ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ ‘ఆపరేషన్ ఫైర్‌వాల్-2026’ చేపట్టింది. ఏపీతో పాటు కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, గోవా, ఢిల్లీ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, బిహార్‌లో మొత్తం 12 ప్రత్యేక బృందాలు తనిఖీలు, దర్యాప్తు చేపట్టాయి. ఆయా రాష్ట్రాల ఏటీఎస్, స్థానిక పోలీసులు, నేవీ అధికారులతో కలిసి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండి: చంద్రబాబుతో సునీత దంపతుల భేటీ!


