మఫ్టీలో వెళ్లి.. పౌరుల అరెస్టులా? | Andhra Pradesh High Court angered on police | Sakshi
Sakshi News home page

మఫ్టీలో వెళ్లి.. పౌరుల అరెస్టులా?

Sep 25 2025 5:51 AM | Updated on Sep 25 2025 7:18 AM

Andhra Pradesh High Court angered on police

యూనిఫాంలోనే వెళ్లాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు పట్టవా?

అవి మీకు వర్తించవని అనుకుంటున్నారా?

పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

సోషల్‌ మీడియా యాక్టివిస్టు సౌందరరెడ్డిని రాత్రి 7.30–8.45 మ«ధ్య అరెస్ట్‌ చేశామంటున్నారు 

మరి ఆయన భార్య రాత్రి 7 గంటలకే ఎలా ఫిర్యాదు చేస్తారు? 

దీనిపై నిజాలను నిగ్గు తేలుస్తాం.. తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌ సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తాం 

రాత్రి 7 గంటలకు లక్ష్మీప్రసన్న పోలీస్‌స్టేషన్‌లో ఉన్నట్లు కనిపిస్తే.. పోలీసులు అబద్ధాలు చెబుతున్నట్లే.. 

22 సాయంత్రం 5 నుంచి రాత్రి 12 వరకు సీసీటీవీ ఫుటేజీని మా ముందుంచండి 

పోలీసులకు హైకోర్టు ఆదేశం.. విచారణ శుక్రవారానికి వాయిదా 

ఈలోపు సౌందరరెడ్డిని స్వేచ్ఛగా వదిలేయాలని ఆదేశం.. ఆయన సెల్‌ టవర్‌ లొకేషన్‌ వివరాలు ఇవ్వాలని ‘జియో’కు ఆదేశం

సాక్షి అమరావతి: పోలీసులు యూనిఫామ్‌లో కాకుండా.. సివిల్‌ దుస్తుల్లో వెళ్లి అరెస్టులు చేస్తుండటాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ విషయంలో సాక్షాత్తూ సుప్రీంకోర్టు తీర్పునే పట్టించుకోరా? అని సూటిగా నిలదీసింది. ఇదెక్కడి సంస్కృతి అంటూ ప్రశ్నించింది. మఫ్టీలో వెళ్లి సోషల్‌ మీడియా యాక్టివిస్టు కుంచాల సౌందరరెడ్డిని అరెస్ట్‌ చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. అసలు పౌరులను అరెస్ట్‌ చేయడానికి మఫ్టీలో ఎందుకు వెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అందరూ పాటించాల్సిందేనంది. సు­ప్రీంకోర్టు ఆదేశాలు మీకు వర్తించవని అనుకుంటున్నారా..? అని నిలదీసింది. 

తన భర్త సౌందరరెడ్డిని పోలీసులు ఈనెల 22న సాయంత్రమే అరెస్ట్‌ చేశారంటూ రాత్రి 7 గంటల సమయంలో పిటిషనర్‌ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తే... మీరు మాత్రం రాత్రి 7.30–8.45 గంటల మధ్య అరెస్ట్‌ చేశామని ఎలా చెబుతా­రని విస్మయం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి తాము తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాలని నిర్ణయించినట్లు హైకోర్టు ప్రకటించింది. రాత్రి 8.30 గంటలకు సౌందర­రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేస్తే, ఆమె 7 గంటలకే ఫిర్యాదు చేసేందుకు తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు ఎందుకు వెళతారని ప్రశ్నించింది.  

సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తాం... 
ఒకవేళ పిటిషనర్‌ లక్ష్మీప్రసన్న(సౌందరరెడ్డి భార్య) తన భర్త అక్రమ నిర్బంధంపై ఫిర్యాదు చేసేందుకు రాత్రి 7 గంటలకు తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తే పోలీసులు చెప్పేదంతా అబద్ధమని తేలి­పో­­తుం­దని హైకోర్టు తేల్చి చెప్పింది. అందువల్ల ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి అదే రోజు అర్థరాత్రి 12 
గంటల వరకు సీసీటీవీ ఫుటేజీని తమ ముందుంచాలని తాడేపల్లి పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈలోపు సౌందరరెడ్డిని స్వేచ్ఛగా వదిలేయా­లని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణకు కోర్టు ముందు హాజరు కావాలని ఆయన్ను ఆదేశించింది. 22, 23వ తేదీల్లో సౌందరరెడ్డి ఎక్కడున్నారో నిర్ధారించేందుకు అతనున్న సెల్‌ఫోన్‌ టవర్‌ వివరాలను తమ ముందుంచాలని జియోను ఆదేశిం
చింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రావు రఘునందన్‌రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్‌ల ధర్మాసనంబుధవారం ఉత్తర్వులిచ్చింది. 

అక్రమ నిర్బంధంపై పిటిషన్‌... 
తన భర్త సౌందరరెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ కుంచాల లక్ష్మీప్రసన్న హైకోర్టులో మంగళవారం హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేయడం తెలిసిందే. అయితే సౌందరరెడ్డిని తాము అదుపులోకి తీసుకోలేదని, ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. దీంతో సౌందరరెడ్డి ఎక్కడున్నా వెతికి తమ ముందు మాత్రమే హాజరుపరచాలని, ఆయన్ను ఏ కేసులోనూ మేజి్రస్టేట్‌ ముందు హాజరుపరచడానికి వీల్లేదని పోలీసులను ధర్మాసనం ఆదేశించిన విషయం తెలిసిందే. 

బుధవారం ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) తిరుమాను విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ సౌందరరెడ్డిని ప్రత్తిపాడు పోలీసులు గంజాయి కేసులో అరెస్ట్‌ చేశారన్నారు. సౌందరరెడ్డి ఎక్కడ ఉన్నారో తెలియదని పిటిషనర్‌ చెబుతున్నారని, వాస్తవానికి ఆయన ఎక్కడున్నారనే విషయం వారికి తెలుసునన్నారు. సౌందరరెడ్డిని కోర్టుకు తెచ్చినప్పుడు అక్కడికి ఆయన బావ మరిది వచ్చారన్నారు. 

ధర్మాసనం స్పందిస్తూ బావ మరిది కోర్టుకు రాకూడదా? దీనికి, సౌందరరెడ్డి అరెస్ట్‌కు ఏం సంబంధం ఉందని ప్రశ్నించింది. తన భర్తను అపహరించారని లక్ష్మీప్రసన్న ఫిర్యాదు చేస్తే దానిపై పోలీసులు ఎందుకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని నిలదీసింది. కేవలం జనరల్‌ డైరీలో రాసి చేతులు దులుపుకొన్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. 

హైకోర్టు చెప్పినా వినకుండా.. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు... 
ఈ సమయంలో లక్ష్మీప్రసన్న తరఫు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డి స్పందిస్తూ, సౌందరరెడ్డిని మేజి్రస్టేట్‌ ముందు హాజరుపరచడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంగా చెప్పినా పోలీసులు ఖాతరు చేయకుండా మేజి్రస్టేట్‌ ముందు హాజరుపరిచారని తెలిపారు. అది కూడా హైకోర్టులో విచారణ జరుగుతుండగానే పోలీ­సులు ఆయన్ను మేజి్రస్టేట్‌ వద్దకు తీసుకెళ్లారన్నారు. 

అయితే హైకోర్టు ఉత్తర్వుల గురించి తాము మేజిస్ట్రేట్ కు నివేదించడంతో ఆయన రిమాండ్‌ విధించకుండా సౌందరరెడ్డిని హైకోర్టు ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించారన్నారు.  సౌందరరెడ్డిని పోలీసులు సివిల్‌ దుస్తుల్లో వచ్చి పట్టుకెళ్లారని రామలక్ష్మణరెడ్డి హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీ, ఫోటోలున్నాయన్నారు.   

‘సుప్రీం’ ఆదేశాలు మీకు వర్తించవా..? 
ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అసలు పోలీసులు యూనిఫామ్‌లో కాకుండా సివిల్‌ దుస్తుల్లో వచ్చి ఎలా అరెస్టులు చేస్తారని ప్రశ్నించింది. కోర్టులోనే ఉన్న ప్రత్తిపాడు సీఐ శ్రీనివాస్‌తో నేరుగా ధర్మాసనం మాట్లాడింది. సివిల్‌ దుస్తుల్లో అరెస్టులు చేయడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధం కదా? మరి మీరెందుకు సివిల్‌ దుస్తుల్లో వెళుతున్నారు? ఇదేం సంస్కృతి? సుప్రీంకోర్టు ఆదేశాలు మీకు వర్తించవని అనుకుంటున్నారా? మఫ్టీలో ఎందుకు అపార్ట్‌మెంట్‌ వద్దకు వెళ్లారు? అంటూ  ప్రశ్నల వర్షం కురిపించింది. యూనిఫామ్‌లో ఉంటే నిందితులు పారిపోతారని మఫ్టీలో ఉంటున్నామని సీఐ చెప్పారు.  ఈ సమాధానంపై ధర్మాసనం సంతృప్తి చెందలేదు.   

నన్ను, నా భార్యను పోలీసులు బాగా ఇబ్బంది పెట్టారు... 
ఇంతకీ సౌందరరెడ్డి ఎక్కడ ఉన్నారని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించడంతో.. కోర్టు ముందుకు తీసుకొచ్చామంటూ పోలీసులు ఆయన్ను ప్రవేశపెట్టారు. సహ నిందితుల వాంగ్మూలం ఆధారంగా సౌందరరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారని రామలక్ష్మణరెడ్డి తెలిపారు. రిమాండ్‌ రిపోర్టులో రాత్రి 7.30 గంటలకు అతన్ని పాతూరు రోడ్డులో అరెస్ట్‌ చేశారని పేర్కొన్నారని, అయితే నిర్దిష్టంగా ఏ ప్రాంతంలో అరెస్ట్‌ చేశారో మాత్రం పేర్కొనలేదన్నారు. 

వాస్తవానికి సౌందరరెడ్డిని పోలీసులు 22 సాయంత్రమే అరెస్ట్‌ చేశారన్నారు. అంతకు ముందు పోలీసులు మఫ్టీలో అపార్ట్‌మెంట్‌కు సైతం వచ్చి వెళ్లారన్నారు. అదే రోజు రాత్రి 7 గంటలకే లక్ష్మీప్రసన్న తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సౌందరరెడ్డి అపహరణపై ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం కోర్టులో ఉన్న సౌందరరెడ్డితో స్వయంగా మాట్లాడటంతో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పోలీసులు తనను, తన భార్యను బాగా ఇబ్బంది పెట్టారని వెల్లడించారు. గంజాయి కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement