
ఈ విద్యా సంవత్సరం నుంచి రెండు కాలేజీల్లో అడ్మిషన్లు నిలిపివేత
చింతపల్లిలోని ఏకైక సేంద్రీయ పాలిటెక్నిక్.. తిరుపతిలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల మూత
ఇదే బాటలో మరో నాలుగు కూడా మూసివేసే యోచనలో సర్కారు
సెకండియర్ డిప్లొమా విద్యార్థులు సమీప కళాశాలల్లో సర్దుబాటు
అడ్మిషన్లు తగ్గిపోతున్నాయనే సాకుతో దశలవారీగా మూసేయాలని ప్రభుత్వ నిర్ణయం
నిజానికి.. నిధులలేమే కారణమని ఆరోపణలు
సాక్షి, అమరావతి : టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులపైనే కాదు.. వ్యవసాయ విద్యపై కూడా కక్ష కట్టింది. తిరుపతిలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని ఏకైక సేంద్రీయ పాలిటెక్నిక్ కళాశాలను మూసివేసింది. ఇదే బాటలో నాన్ శాంక్షన్ వ్యవసాయ, పాలిటెక్నిక్ కళాశాలలను దశల వారీగా మూసివేసేందుకు రంగం సిద్ధంచేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సామాన్య, మధ్యతరగతి, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేవలం పదో తరగతి అర్హతతో వ్యవసాయ విద్యను అందించడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండేళ్ల కాలపరిమితి గల వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సును 1999లో ప్రవేశపెట్టింది.
తొలిసారిగా అనకాపల్లి, మార్టేరు (పశ్చిమ గోదావరి)లో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటుచేశారు. వ్యవసాయ విద్యకు డిమాండ్ పెరగడంతో వీటి సంఖ్య పెంచాల్సి వచి్చంది. ప్రస్తుతం 20 ప్రభుత్వ, 30 అనుబంధ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. ఈ కళాశాలల్లో వ్యవసాయ, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ ఫార్మింగ్, వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగాల్లో కూడా పాలిటెక్నిక్ డిప్లమో కోర్సులు అందిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో 688, ప్రైవేటు కళాశాలల్లో 1,690 సీట్లున్నాయి.
యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న 20 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఆరు కళాశాలలు స్థానికంగా ఉన్న డిమాండ్ మేరకు ఏర్పాటుచేశారు. వీటిని నాన్ శాంక్షన్ కళాశాలలు అని పిలుస్తుంటారు. ఒక్కో కళాశాలలో 35 నుంచి 40 సీట్ల వరకు ఉండగా, ఏటా 15–30 మంది విద్యార్థులు డిప్లొమా కోర్సుల్లో చేరుతున్నారు. దాదాపు 15 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ప్రభుత్వ కళాశాలలను అడ్మిషన్లు తగ్గిపోతున్నాయనే సాకుతో దశల వారీగా మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
తిరుపతి కళాశాల మూసివేత దారుణం..
తిరుపతిలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలతో పాటు చింతపల్లిలోని ఆర్గానిక్ ఫారి్మంగ్ పాలిటెక్నిక్ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు నిలిపివేస్తూ యూనివర్శిటీ రిజి్రస్టార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఈ కళాశాలలు ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే అధికారికంగా మూతపడబోతున్నాయి. ద్వితీయ సంవత్సరం విద్యనభ్యసిస్తున్న డిప్లొమా విద్యార్థులను సమీప కళాశాలలకు సర్దుబాటుచేసే యోచనలో ఉన్నారు.
ఇక 2011లో ఏర్పాటైన చింతపల్లి పాలిటెక్నిక్ కళాశాలను 2014–15లో సేంద్రీయ వ్యవసాయ కళాశాలగా మార్చారు. సేంద్రీయ విభాగంలో ఉన్న ఏకైక ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఇదొక్కటే. ప్రారంభం నుంచి 30 మంది విద్యార్థులుండగా, ప్రస్తుతం ఏటా 15–20 మంది చేరుతున్నారు. గడిచిన ఐదేళ్లుగా ఈ కళాశాల విద్యార్థులు మొదటి ర్యాంకులను సాధిస్తున్నారు.
రూ.40 లక్షలతో ఆధునీకరించిన తర్వాత..
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో చింతపల్లి కళాశాలలో రూ.40 లక్షలతో అత్యాధునిక సౌకర్యాలను సమకూర్చారు. విద్యార్థులకు అవసరమైన విశాలమైన తరగతి గదులు, డిజిటల్ బోర్డులు, ప్రయోగశాలలు, సోలార్ వ్యవస్థలను ఏర్పాటుచేశారు. గిరిజన విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఈ కళాశాలను మూసివేయడంపట్ల విమర్శలు విన్పిస్తున్నాయి. ఓ వైపు సేంద్రియ సాగుకు పెద్దపీట వేస్తున్నామని, వచ్చే ఐదేళ్లలో 50 లక్షల ఎకరాలను ప్రకృతి సాగుగా మార్చబోతున్నామంటూ గొప్పలు చెబుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఉన్న ఒక్కగానొక్క సేంద్రీయ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మూసివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
మూడేళ్ల కాలపరిమితితో కూడిన వ్యవసాయ విద్య అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి ఇలా ఉన్న కళాశాలను మూసివేయడం సరికాదంటున్నారు. ఇదే బాటలో రామగిరి, రంపచోడవరం, సోమశిల, నంద్యాలలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలను కూడా మూసివేసే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అడ్మిషన్లు తక్కువగా ఉన్నాయని చెబుతున్నప్పటికీ నిధులలేమి కారణంగా వీటిని మూసివేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి శాంక్షన్ తెచ్చుకోవడం.. అవసరమైన నిధులను మంజూరుచేయడం చేతకాక ఇలా ఒక్కొక్కటిగా ప్రభుత్వ కళాశాలలను మూసివేయడం ద్వారా నిరుపేద విద్యార్థులకు వ్యవసాయ విద్యను దూరం చేయడం ఎంతవరకు సమంజసమని విద్యారంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.