ఉల్లి రైతుల గోడు పట్టదా చంద్రబాబూ: ఎస్వీ మోహన్‌రెడ్డి | YSRCP Leader SV Mohan Reddy Fires On Chandrababu Government | Sakshi
Sakshi News home page

ఉల్లి రైతుల గోడు పట్టదా చంద్రబాబూ: ఎస్వీ మోహన్‌రెడ్డి

Aug 28 2025 6:34 PM | Updated on Aug 28 2025 6:49 PM

YSRCP Leader SV Mohan Reddy Fires On Chandrababu Government

సాక్షి, కర్నూలు: ఉల్లి పంటకు కనీస మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ తీవ్రంగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. కర్నూలు మార్కెట్‌ యార్డ్‌ను సందర్శించి కనీస ధర లేక అల్లాడుతున్న ఉల్లి రైతులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా పలువురు ఉల్లి రైతులు తమ కష్టాలను ఆయనకు వివరించారు.

వారం రోజులుగా మార్కెట్‌లో పంటను తెచ్చిపెట్టామని, వ్యాపారులు, దళారులు నామమాత్రపు రేటు చెబుతున్నారని,  కొనేవారు లేక రోజుల తరబడి మార్కెట్‌లోనే పడిగాపులు కాస్తున్నామంటూ రైతులు వాపోయారు. రైతులకు వైఎస్సార్‌సీపీ తరుఫున అండగా ఉంటామని, ఈ ప్రభుత్వం మెడలు వంచి అయినా సరే ఉల్లి కొనుగోళ్ళు జరిగేలా చూస్తామని ఈ సందర్బంగా ఆయన హామీ ఇచ్చారు. ఉల్లి రైతులతో కలిసి ప్రభుత్వం తక్షణం స్పందించాలని ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..

కర్నూలు మార్కెట్‌ యార్డ్‌లో ఉల్లి రైతులు తమ పంటను అమ్మకునేందుకు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. గతంలో క్వింటా రూ.3 వేల నుంచి రూ.5 వేల రేటు పలికేది. తక్కువ నాణ్యత ఉన్న పంట క్వింటా కనీసం రూ.1800 నుంచి రూ.2000 పలికేది. కానీ ఈ ఏడాది వంద రూపాయలు కూడా పలకడం లేదు. రైతులకు ఒక్కో ఎకరాకు రూ.1.20 లక్షల వరకు పెట్టుబడి వ్యయం అవుతోంది. ఎకరాకు వంద క్వింటాళ్ళు దిగుబడి వస్తే, క్వింటాకు రూ.100 చొప్పున కనీసం రూ.10 వేలు కూడా వారికి దక్కడం లేదు. ఒక్కో రైతు దాదాపుగా లక్ష రూపాయలు ఎకరానికి నష్టపోతున్నారు.

..వారం రోజుల నుంచి ఒక్కో రైతు ఉల్లిగడ్డలతో వచ్చి కొనేవారు లేక నిరీక్షిస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్‌ జగన్ ఏ పంటకైనా రేటు లేకపోతే ప్రభుత్వం తరుఫు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో కనీసం రైతును పరామర్శించే వారు లేరు. అప్పులు చేసి ఉల్లి సాగు చేసిన రైతులు, అప్పుల తీర్చలేక ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. దయచేసి రైతులు ఇటువంటి పనులు చేయవద్దని, వారి తరఫున వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని తెలియచేస్తున్నాం.

..రైతులకు కష్టం వచ్చినప్పుడు స్పందించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదా? గతంలో మిర్చి, మామిడి, పొగాకు ఇలా ఆయా పంటల కోసం రైతుల కోసం వైఎస్‌ జగన్ నిలబడ్డారు. వైఎస్సార్‌సీపీ తరుఫున దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్ప వారిలో చలనం రాలేదు. నేడు కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులకు రైతుల గోడు పట్టదా? కనీసం మార్కెట్ యార్డ్‌కు వచ్చి రైతు కష్టాన్ని తెలుసుకునే తీరిక కూడా వారికి లేదా? బయట మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.30కి అమ్ముతున్నారు. కానీ రైతుల నుంచి మాత్రం క్వింటా రూ.100కి కొంటామని వ్యాపారులు చెబుతుంటే ఎలా ఉపేక్షిస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. తక్షణం ప్రభుత్వం స్పందించి, మద్దతుధరకు ఉల్లి కొనుగోళ్ళు చేపట్టాలి. లేనిపక్షంలో రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement