
సాక్షి, కర్నూలు: అధికార అండతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. నందవరం మండలం హాలహర్వి (NH 167) టోల్ గేట్ సిబ్బందిపై టీడీపీ నేత పాలకుర్తి శ్రీనివాస్‌రెడ్డి దాడికి దిగారు. తన వద్దే టోల్ వసూలు చేస్తారా అంటూ టోల్ గేట్ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. టోల్ గేట్ సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషించిన టీడీపీ నేత.. దాడికి పాల్పడ్డారు. దాడి దృశ్యాలు సీసీ పుటేజ్‌లో రికార్డయ్యాయి.

కాగా, శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్సార్‌సీపీ నాయకులపై గూండాగిరి చేసిన సంగతి తెలిసిందే. వైఎస్సార్‌సీపీకి చెందిన మండల పరిషత్ అధ్యక్షుడు (ఎంపీపీ) పురుషోత్తమరెడ్డి హత్యకు ఇటీవల విఫలయత్నం చేసిన ‘పచ్చ’ బ్యాచ్ అకృత్యాలు, దౌర్జన్యాలు, దోపిడీలను ప్రజల ముందు ఉంచడానికి మంగళవారం(ఆగస్టు 27) చిలమత్తూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ నేతలు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు.

ప్రెస్‌మీట్ నిర్వహిస్తే తన బండారం ఎక్కడ బయట పెడతారోనన్న భయంతో టీడీపీ నాయకుడు నాగరాజు యాదవ్ టీడీపీ గూండాలు, అనుచరులతో కలిసి స్థానిక చెన్నంపల్లి క్రాస్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్దకు దూసుకువచ్చారు. టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ కార్యాలయం వైపు వస్తున్నారని తెలుసుకున్న సీఐ జనార్దన్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. టీడీపీ గూండాలు అధికార మదంతో రోడ్డును దిగ్బంధించి నానా రభస సృష్టించారు.