
సాక్షి, నంద్యాల జిల్లా: అధికార పార్టీ ఎమ్మెల్యేలు వరుస వివాదాలతో వార్తల్లో కెక్కుతున్నారు. ఉపేక్షించబోనని ఆ పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరిస్తున్నా.. నారా లోకేష్ అండతో చెలరేగిపోతున్నారు. తాజాగా.. శ్రీశైలం శిఖరం చెక్ పోస్ట్ వద్ద ఫారెస్ట్ వాహనాన్ని ఆపి తమపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారంటూ ఫారెస్ట్ సిబ్బంది ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
ఎమ్మెల్యే దాడి విషయాన్ని ఫారెస్ట్ సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫారెస్ట్ వాహనాన్ని ఎమ్మెల్యే తానే నడుపుతూ.. సిబ్బందిని వాహనంలో ఎక్కించుకెళ్లినట్లు సమాచారం. అర్ధరాత్రి 2 గంటల వరకు ఫారెస్ట్ సిబ్బందిని ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తిప్పినట్లు తెలిసింది.
ఫారెస్ట్ గార్డ్ గురవయ్యపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అనుచరులు దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మేం చెప్పినట్టు వినడం లేదని ఎమ్మెల్యే దాడి చేశారంటున్న ఫారెస్ట్ సిబ్బంది.. డిపార్ట్‌మెంట్ వాహనాన్ని కూడా ఎమ్మెల్యే లాక్కున్నారంటూ ఆరోపిస్తున్నారు. అటవీ శాఖ సిబ్బందిపై బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, అనుచరుల దాడిపై ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.
