
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
నేడు మరింత బలపడే అవకాశం
తీరం వెంబడి 50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. బుధవారం అర్థరాత్రి లేదా గురువారం తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది. మరోవైపు..వాయువ్య బంగాళాఖాతంలో రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.
అనకాపల్లి జిల్లా సాలపువానిపాలెంలో 6 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళంలో 5.8, విశాఖ జిల్లా నాతయ్యపాలెం, అనకాపల్లి జిల్లా గంధవరం, లంకెలపాలెంలో 5. 5, విజయనగరం అర్బన్‌లో 5.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.శ్రీకాకుళం జిల్లాలో జాతీయ రహదారి జలదిగ్భంధమవ్వడంతో రాకపోకలు స్తంభించాయి. శ్రీకాకుళం, విశాఖ, మన్యం జిల్లాల్లో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేకచోట్ల 130–150 మి.మీ వర్షపాతం నమోదైంది.
ఈ భారీ వర్షాలు బుధవారం ఉదయం వరకూ కొనసాగే అవకాశం ఉందనీ.. తర్వాత ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏలూరు,అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారి స్టెల్లా తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో సాయంత్రం వరకూ తేలికపాటి వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా మారి తీరం వెంబడి గంటకు 40–50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయనీ ,28వ తేదీ వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
మొద్దు నిద్రలో ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ
అల్పపీడనం ప్రభావంపై వాతావరణశాఖ వారం ముందుగానే హెచ్చరించినా.. ఏపీ విపత్తుల నిర్వహణ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. విశాఖలోని డాప్లర్ వెదర్ రాడార్ పనితీరు మందగించింది. గతంలో ప్రతి 10 నిమిషాలకోసారి అప్‌డేట్స్ అందించే రాడార్ ఇప్పుడు గంటకోసారి సమాచారం ఇస్తున్నా అధికారులు సరిచేయలేదు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీఎస్‌డీపీఎస్.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్ రెండు రోజులుగా మూగబోయింది. భారీ వర్షాలు, పిడుగులు పడిన తర్వాత మొబైల్స్‌కు ఎస్‌ఎంఎస్‌లు వస్తుండడం గమనార్హం.