
జలప్రవేశం చేసిన ఐఎన్‌ఎస్ హిమగిరి
ఆత్మనిర్భర్ భారత్‌తో నౌకా నిర్మాణాల్లో నంబర్–1గా నిలిచాం
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
విశాఖలో ఐఎన్‌ఎస్ హిమగిరి, ఉదయగిరి నౌకలను ప్రారంభించి జాతికి అంకితం చేసిన రక్షణ మంత్రి
సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగంలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదిగిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్‌తో నౌకా నిర్మాణాల్లో నంబర్–1గా నిలిచామని పేర్కొన్నారు. విశాఖలోని తూర్పు నౌకాదళంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
అత్యాధునిక సాంకేతికతో నిర్మించిన ఐఎన్‌ఎస్ హిమగిరి, ఐఎన్‌ఎస్ ఉదయగిరి యుద్ధ నౌకల్ని కమిషనింగ్(ప్రారంబోత్సవం) చేసి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి దేశ రక్షణ, ఆత్మనిర్భర్ భారత్ తదితర అంశాలపై మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
ఆర్థిక భద్రతకు నౌకాదళం మూలస్తంభం
‘‘సముద్ర రక్షణకే పరిమితం కాకుండా.. దేశ ఆర్థిక భద్రతకు మూలస్తంభంగా నౌకాదళం ఉంది. ఇండియన్ నేవీ సామర్థ్యాన్ని పెంచేలా యుద్ధ నౌకల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. విపత్తుల సమయంలో సహాయ కార్యక్రమాల్లోనూ నేవీ సేవలు శ్లాఘనీయం. అత్యాధునిక స్టెల్త్ ఫీచర్లు, రాడార్లు, అధునాతన నిఘా వ్యవస్థ, సూపర్ సోనిక్ క్షిపణులతో కూడిన వ్యవస్థలు పొందుపరిచిన ఐఎన్‌ఎస్, ఉదయగిరి, హిమగిరి లీడ్ షిప్స్‌గా వ్యవహరిస్తాయి. వార్‌షిప్ డిజైన్ బ్యూరో ద్వారా రూపొందించిన 100, 101 యుద్ధనౌకలు కావడం గర్వకారణం. ఆత్మనిర్భర్‌భారత్‌లో భాగంగా.. స్వదేశీ పరిజ్ఞానాన్ని భారత్ ఎంతలా అందిపుచ్చుకుంటుందో ఈ నిర్మాణాలే ప్రత్యక్ష ఉదాహరణ.
స్వదేశీ పరిజ్ఞానం వినియోగంలో ముందు
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠీ మాట్లాడుతూ.. లీడ్ వార్‌షిప్స్ డబుల్–కమిషనింగ్ భారతదేశ సాగర శక్తి నిరంతర పురోగతి, సామర్థ్య విస్తరణకు స్పష్టమైన సంకేతాలని పేర్కొన్నారు. స్వదేశీ పరిజ్ఞానం ఉపయోగించడంలో ఇండియన్ నేవీ ముందు వరసలో ఉందని తెలిపారు.
యుద్ధ నౌకల పరిశీలన
ఉదయగిరి, హిమగిరి యుద్ధ నౌకల్ని జాతికి అంకితం చేసిన అనంతరం వాటిని మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పరిశీలించారు. తర్వాత పాతతరం ఉదయగిరి, హిమగిరి యుద్ధ నౌకల్లో విధులు నిర్వర్తించిన ఎక్స్ కమాండింగ్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి ఫోటోలు తీసుకున్నారు. కార్యక్రమంలో తూర్పునౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్, నేవీకి చెందిన ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.
హిందూ మహాసముద్రంలో పెరిగిన బలం
ఈ రెండు యుద్ధ నౌకలు భారత నౌకాదళంలో చేరడంతో హిందూ మహాసముద్రంలో భారత్ బలం మరింత పెరిగింది. మొదటి ప్రాధాన్య భద్రతా భాగస్వామిగా భారత్ అవతరించనుంది. పైరసీని ఎదుర్కోవడం, స్మగ్లింగ్, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాటం, సముద్ర ఉగ్రవాదాన్ని అరికట్టడంతోపాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలో సేవలందించడంలో ఉదయగిరి, హిమగిరి గేమ్ ఛేంజర్స్ కానున్నాయి. అరేబియా సముద్రం నుంచి తూర్పు ఆఫ్రికన్ సముద్ర తీరం వరకు నావికాదళ కార్యకలాపాలు సజావుగా నిర్వహించడం ప్రశంసనీయం.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం
యుద్ధాలు, శత్రుదేశాలైనా సరే దాడులకు భారత్ పూర్తి వ్యతిరేకం. దూకుడుగా వ్యవహరించి ఇప్పటివరకూ ఏ దేశంపైనా భారత్ దాడి చెయ్యలేదు. కానీ పహల్గామ్ ఉగ్రదాడి యావత్ దేశాన్ని కుంగదీసింది. దేశ భద్రతపై దాడి జరిగితే ఎలా స్పందించాలో భారత్‌కు తెలుసు. దానికి ఉదాహరణే ఆపరేషన్ సిందూర్. ఆపరేషన్ సిందూర్ ముగిసిపోలేదు. విరామం మాత్రమే ఇచ్చాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటానికి సిద్ధంగా ఉన్నాం.’’