బీసీ రిజర్వేషన్ల అంశాన్ని వైఎస్సార్‌సీపీపైకి నెట్టి తప్పించుకునే యత్నం
హైకోర్టు, సుప్రీంకోర్టులు కొట్టేసినా కేబినెట్ తీర్మానం అంటూ టీడీపీ డ్రామా
సాక్ష్యాధారాలన్నీ కనిపిస్తున్నా సీఎం, మంత్రులు అడ్డగోలు ప్రకటనలు
గతంలో జగన్ ప్రభుత్వం ఇచ్చిన 34 శాతం రిజర్వేషన్లపై కోర్టుకు వెళ్లింది టీడీపీ నేతే
అప్పట్లో హైకోర్టు అభ్యంతరం చెప్పకపోయినా, సుప్రీంకోర్టుకు వెళ్లి కొట్టేయించిన బాబు అండ్ కో
2019 మార్చి 9న ఆ నేతకు నామినేటెడ్ పదవి కట్టబెట్టిన వెన్నుపోటు ప్రభుత్వం
అమలు సాధ్యం కాదని తెలిసినా మేనిఫెస్టోలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లంటూ హామీ
కోర్టులో ఎలాగూ కొట్టేస్తారని తెలిసీ జీవో ఇచ్చిన వైనం
పార్లమెంట్‌లో చట్టం చేయడం ద్వారా మాత్రమే సాధ్యమని తెలిసినా ఇన్నాళ్లూ కాలయాపన
సాక్షి, అమరావతి : పార్లమెంట్ చట్టం ద్వారా తప్ప కేవలం జీవోలతో సాధ్యం కాని బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపు సగం జనాభా ఉండే వెనుకబడిన తరగతి ప్రజలను మభ్యపెడుతోంది. ఈ క్రమంలో ఆడిన రాజకీయ డ్రామాలో అడ్డంగా దొరికి పోయినా, సీఎం చంద్రబాబు.. మంత్రులు మాత్రం ఇంకా బుకాయించడం మానుకోలేదు. బీసీలకు వెన్నుపోటు పొడవడం అందరికీ కళ్లెదుటే కనిపిస్తున్నా, దాన్ని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ పైకి నెట్టేసి తప్పించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తూనే ఉన్నారు. బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర హైకోర్టులో గానీ, సుప్రీంకోర్టులో గానీ పిటీషన్ దాఖలు చేయకపోయినా, నింద మోపాలని చూస్తున్నారు.
మరో వైపు 2020–21లో జరిగిన గత స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు అప్పటి జగన్ ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో అధికారుల స్థాయిలో ఏ స్థానంలో, ఏ సామాజిక వర్గ అభ్యర్థి పోటీ చేయాలనే రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వీటిని వ్యతిరేకిస్తూ టీడీపీ నేత కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రస్తుతం కోర్టులో నిలబడదని తెలిసీ కూటమి ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ జీవో ఇచ్చింది. హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేశాక కేబినేట్ తీర్మానం పేరుతో మరో డ్రామాకు తెరతీసింది.
టీడీపీ నేత ద్వారా కోర్టుకు వెళ్లి అడ్డగింత
2020–21లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ అప్పటి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2019 డిసెంబరు 28వ తేదీన జీవో 176 జారీ చేసింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ, ఎస్టీలకు కలిపి మొత్తం 59 శాతం రిజర్వేషన్ల అమలుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ రిజర్వేషన్లు మొత్తం 50 శాతం దాటుతున్నాయంటూ బిర్రు ప్రతాప్ రెడ్డి అనే టీడీపీ నేత సుప్రీంకోర్టు దాకా వెళ్లారు.
ఈ నేతను ఉపాధి హామీ పథకం అమలు తీరును పర్యవేక్షించే రాష్ట్ర కౌన్సిల్ (ఎపీఎస్‌ఈజీసీ)లో సభ్యుడిగా నియమిస్తూ 2019 మార్చి 9వ తేదీన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జీవో 96 జారీ చేసింది. ఇంత స్పష్టమైన ఆధారాలున్నా, మంత్రులు మాత్రం తాజాగా శనివారం (అక్టోబరు 10న) కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై నిందలేయడం దారుణం అని సర్వత్రా చర్చ జరుగుతోంది. వాస్తవానికి జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ద్వారా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడు ఆ రిజర్వేషన్లతో ఎన్నికల నిర్వహణకు 2020 జనవరిలో రాష్ట్ర హైకోర్టు కూడా ఎటువంటి అభ్యంతరం తెలపలేదు.
అప్పట్లో జనవరి 17వ తేదీన పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడానికి అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసుకోగా, అప్పటి జగన్ ప్రభుత్వం తీసుకున్న 59 శాతం రిజర్వేషన్ల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నేత బిర్రు పత్రాప్‌రెడ్డి 2020 జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు స్టే ఇచ్చి.. తిరిగి ఈ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర హైకోర్టులో నిర్ణయం జరిగేలా ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా 2020 జనవరి–ఫిబ్రవరి నెలల్లో రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది.
ఐదేళ్ల కిత్రం ఎన్నికల్లోనే బీసీలకు 34 శాతం పదవులు
2020–21లో జరిగిన మున్సిపల్ ఎన్నికలప్పుడు రాష్ట్ర హైకోర్టు మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని ఆదేశాల అనంతరం కూడా అప్పటి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పార్టీ పరంగా బీసీలకు దాదాపు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసింది. అప్పటికి రాష్ట్రంలో మొత్తం 103 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉండగా, వాటిలో 34 మున్సిపల్ చైర్మన్ పదవులను బీసీలకే కేటాయిస్తూ రిజర్వేషన్లు ఖరారు చేసింది.
ఈ మేరకు 2020 మార్చి 7వ తేదీన గెజిట్ నెంబరు 4 జారీ చేసింది. అప్పటికి ఉన్న 16 నగర కార్పొరేషన్ మేయర్ పదవుల్లో బీసీలకు 5 పదవులు కట్టబెట్టింది. అయితే ప్రస్తుత వెన్నుపోటు ప్రభుత్వం.. ఇదివరకెన్నడూ లేని విధంగా బీసీలకు 34 శాతం పార్టీ పరంగా ఇవ్వనున్నామని చెప్పుకోవడంపై అధికార వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.


