వారిద్దరూ ప్రాణ స్నేహితులు.. అన్నదమ్ముల్లా సరదాగా ఉండేవారు.. పండుగైనా, శుభకార్యమైనా.. ఎక్కడికెళ్లాలన్నా కలిసే ఉండేవారు. దసరా పండుగ సందర్భంగా మంగళవారం ఇద్దరి ఇళ్లలోనూ సరదాగా గడిపారు.. పండుగ సంప్రదాయాలను పూర్తి చేసుకొని, భోజనం చేసిన అనంతరం సినిమాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఎప్పటిలాగే ఇద్దరూ ఒకే బైక్‌పై బయల్దేరారు. అలా ఇంటి నుంచి వెళ్లిన ఇద్దరూ తిరిగి వస్తారని కుటుంబ సభ్యులు ఎదురుచూశారు.. అయితే వారి స్నేహబంధాన్ని చూసి మూడు పదులైనా నిండకనే విధికి కన్నుకుట్టింది. రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు ఇద్దరినీ కబళించింది. మంగళవారం మధ్యాహ్నం అనంతపురం రూరల్ మండలం సిండికేట్‌నగర్ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. – రాప్తాడు రూరల్
అనంతపురం రూరల్ మండలం అక్కంపల్లి పంచాయతీ సదాశివకాలనీకి చెందిన వికాస్‌కుమార్ (24) పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. అదే కాలనీకి చెందిన చందు అలియాస్ విక్కీ (26) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. రాచానపల్లి వైపు నుంచి అనంతపురం నగరానికి వెళ్తున్న వికాస్‌కుమార్, చందు బైక్.. సిండికేట్‌నగర్ సమీపంలోని బళ్లారి జాతీయ రహదారిపై సిమ్స్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న యూటర్న్ వద్ద ప్రమాదానికి గురైంది. యూటర్న్ దాటుతున్న సిండికేట్‌నగర్‌కు చెందిన బైక్‌ను వీరి వాహనం ఢీకొంది. దీంతో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారిని వెంటనే అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
రెండు కుటుంబాల్లో తీరని విషాదం..
ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. వికాస్‌కుమార్ తండ్రి పెద్దరెడ్డప్ప సదాశివకాలనీ శాఖ సీపీఐ కార్యదర్శిగా పని చేస్తున్నాడు. ఆయనకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడైన వికాస్ ఇలా అర్ధంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. మరోవైపు చందు అలియాస్ విక్కీది మరింత హృదయవిదారకమైన పరిస్థితి. తండ్రి చంద్రశేఖర్ గతంలోనే మృతి చెందాడు. తల్లి లలితమ్మ కూలి పనులు చేసుకుంటూ ఒక్కగానొక్క కుమారుడిని పెంచి పోషిస్తోంది. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న చందు..ఆ తల్లికి జీవితంలో అండగా ఉంటాడని ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే పండుగ రోజే ఆ తల్లి ఆశలన్నీ ఒక్కసారిగా ఆవిరయ్యాయి. రెక్కల కష్టంతో అల్లారుముద్దుగా పెంచిన కొడుకు ఇక తిరిగిరాడన్న నిజాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది.
ఇద్దరు ప్రాణస్నేహితుల జీవితాలను చిదిమేసిన మృత్యువు
పండుగ పూట పెను విషాదం
దసరా పండుగ వేళ సినిమాకెళ్తుండగా దుర్ఘటన
అనంతపురం రూరల్ సదాశివకాలనీలో రెండు కుటుంబాలకు తీరని శోకం


