పూర్తిస్థాయిలో హామీలు అమలు చేయలేకపోవడం.. ప్రజల సంక్షేమాన్ని విస్మరించడం.. పాలన గాడితప్పి శాంతిభద్రతలు లోపించడం.. ఇదీ చంద్రబాబు ప్రభుత్వం తన రెండున్నరేళ్లలో సాధించిన పురోగతి. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్ | - | Sakshi
Sakshi News home page

పూర్తిస్థాయిలో హామీలు అమలు చేయలేకపోవడం.. ప్రజల సంక్షేమాన్ని విస్మరించడం.. పాలన గాడితప్పి శాంతిభద్రతలు లోపించడం.. ఇదీ చంద్రబాబు ప్రభుత్వం తన రెండున్నరేళ్లలో సాధించిన పురోగతి. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్

Oct 24 2026 12:40 AM | Updated on Oct 24 2026 12:40 AM

● మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం చివరిరోజు కూడా పెద్దవడుగూరులో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు అడుగడుగునా దాష్టీకానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా తొలి రెండు రోజులూ రాళ్లు, కర్రలతో విరుచుకుపడి భయోత్పాతం సృష్టించారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాలకూ నామినేషన్‌ వేసి తీరుతామని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు భీష్మించారు. నామినేషన్లు వేయించేందుకు తాము సహకరిస్తామని సీఐ నరేంద్రరెడ్డి హామీ ఇచ్చారు. ఆ మేరకు చివరిరోజు శుక్రవారం పార్టీ కార్యాలయం వద్ద నుంచి సీఐ తన సిబ్బందితో కలిసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ప్రైవేట్‌ వాహనాల్లో ఎక్కించుకుని నామినేషన్‌ కేంద్రానికి బయల్దేరారు. విషయం తెలుసుకున్న టీడీపీ గూండాలు మార్గమధ్యంలో అడ్డగించి రాళ్లు, కట్టెలతో దాడి చేశారు. దీంతో వాహనాలను అక్కడి నుంచి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. గూండాలను చెదరగొట్టడానికి ప్రయత్నించారు. టీడీపీ వాళ్లతో మంతనాలు చేసిన సీఐ.. తిరిగి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్‌ కేంద్రానికి వాహనాల్లో తీసుకెళ్లారు. పోలీస్‌ భద్రత నడుమ పెద్దవడుగూరులోని నామినేషన్‌ కేంద్రానికి చేరుకున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల్లోని ఓ మహిళ వద్ద నుంచి నామినేషన్‌ పత్రాలు లాక్కుని చించేందుకు టీడీపీ కార్యకర్త ప్రయత్నించగా.. అక్కడున్నవారు అడ్డుకున్నారు. అయినా వారు అంతటితో ఆగలేదు. ఏకంగా నామినేషన్‌ కేంద్రంపై దాడులకు తెగబడ్డారు. కిటికీలను కట్టెలతో బాదారు. వైఎస్సార్‌సీపీ నాయకుల వాహనాలను ధ్వంసం చేశారు. పరిస్థితిని సమీక్షించిన ఎస్పీ జగదీష్‌ పోలీస్‌ బలగాలతో చేరుకోవడంతో టీడీపీ గూండాలు అక్కడి నుంచి పరారయ్యారు.

యల్లనూరులో రణరంగం

ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల చివరిరోజు శుక్రవారం యల్లనూరులో టీడీపీ గూండాలు రణరంగం సృష్టించారు. పోలీసుల భద్రత నడుమ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వెళ్తున్న వాహనాలపై రాళ్లు రువ్వి.. కేకలు వేస్తూ రెచ్చిపోయారు. మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలకు గాను 9 స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్‌ వేశారు. అయితే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామం అయిన తిమ్మంపల్లి ఎంపీటీసీ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేయకూడదని టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు కుట్ర పన్నారు. తిమ్మంపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా మిద్దె మనీషతో నామినేషన్‌ వేయిస్తామని, అందుకు అవకాశం కల్పించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భోగతి విజయప్రతాప్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ సూరి, యూత్‌ విభాగం రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ వనం రవి, ప్రచార కమిటీ మాజీ అధ్యక్షుడు ఈశ్వరరెడ్డి, మాజీ ఉప సర్పంచ్‌ భాస్కర్‌రెడ్డి, బాలవెంకటరెడ్డి, చిలమకూరు జనార్థన్‌తో పాటు తదితరులు పోలీస్‌స్టేషన్‌ వద్ద రోడ్డుపై ధర్నాకు దిగారు. నామినేషన్‌ వేసేందుకు భద్రత కల్పిస్తామని అడిషనల్‌ ఎస్పీ నాగభూషణం, పుట్లూరు సీఐ వంశీ కృష్ణ, ఎస్‌ఐలు రామాంజనేయరెడ్డి, ధరణిబాబు తెలిపారు. ఈ మేరకు అభ్యర్థి మిద్దె మనీషను వాహనంలో ఎక్కించుకుని అడిషనల్‌ ఎస్పీ ముందు వస్తుండగా.. ‘పచ్చ’ గూండాలు రాళ్లు రువ్వుతూ కేకలు వేసుకుంటూ దూసుకొచ్చారు. దాడుల్లో కోడిమూర్తి గ్రామానికి చెందిన ఓబులేసుకు చెవి, తలకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు గాల్లోకి భాష్పవాయువును ప్రయోగించారు. అనంతరం ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయినప్పటికీ మనీషతో నామినేషన్‌ మాత్రం వేయించలేకపోయారు.

గుంతకల్లులో నామినేషన్లకు అడ్డంకులు

అధికార పార్టీ నాయకుల దౌర్జన్యం, దాడుల కారణంగా గుంతకల్లు మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారు. నామినేషన్లు వేసేందుకు కేంద్రం దాకా వచ్చిన అభ్యర్థుల చేతిలోనుంచి పత్రాలను లాక్కుని చించేయడంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లను బాయ్‌కాట్‌ చేశారు.

పెద్దారెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటున్న సీఐ ఆరోహణరావు

ప్రాదేశిక ఎన్నికల్లో ఆగని దమనకాండ

పోలీసుల కళ్లెదుటే దాడులు.. దౌర్జన్యాలు

పచ్చ గూండాలను నిలువరించలేని నిస్సహాయత

కొనసాగిన వైఎస్సార్‌సీపీ నాయకుల హౌస్‌ అరెస్టులు

తాడిపత్రిటౌన్‌: ‘వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేసినా.. ఇంటిపై రాళ్లు రువ్వినా.. కేవలం మా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతోనే రెండున్నరేళ్లుగా సంయమనం పాటించా. మౌనంగా ఉన్నాం కదా అని తెగేదాకా లాగాలని చూడకు’ అంటూ టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డిని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హెచ్చరించారు. స్వగ్రామం యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్‌ వేయకుండా జేసీ అనుచరులైన టీడీపీ గూండాలు దాడులకు తెగబడిన విషయం తెలుసుకున్న పెద్దారెడ్డి.. శుక్రవారం అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తాడిపత్రి పట్టణ సీఐ ఆరోహణరావు సిబ్బందితో వచ్చి పెద్దారెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డి మాట్లాడుతూ జేసీ అనుచరులు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులకు తెగబడుతుంటే పోలీసులు అండగా నిలుస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో తాడిపత్రి, యల్లనూరు మండలంలో ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. జేసీ, పోలీసుల అండ చూసుకుని రెచ్చిపోతున్న టీడీపీ మూకలు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement