● వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణకు అధికారులపై ఒత్తిడి
● ఎంపీటీసీ స్థానాల ఏకగ్రీవాలతో పట్టు పెంచుకోవాలని పాట్లు
సాక్షిప్రతినిధి, అనంతపురం: ఉరవకొండ నియోజకవర్గంలో ఎంపీటీసీ స్థానాలన్నీ అధికార టీడీపీ ఏకగ్రీవం చేసుకునేలా మంత్రి పయ్యావుల కేశవ్ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలు వైఎస్సార్‌సీపీకి సుదీర్ఘకాలంగా బలమైన కంచుకోటలుగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ఉన్న పట్టును దెబ్బతీసేందుకు, పరిషత్ పీఠాలను ఏకగ్రీవంగా కై వసం చేసుకునేందుకు మంత్రి పావులు కదుపుతున్నట్లు సమాచారం. ప్రధానంగా వైఎస్సార్‌సీపీ గెలుపు అవకాశాలు ఉన్న ఎంపీటీసీ స్థానాలు, భారీ మెజారిటీ వచ్చే ఎంపీటీసీ స్థానాలకు దాఖలైన నామినేషన్లను ఏదో ఒక కారణంతో తిరస్కరించాలని ఎన్నికల అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మండలానికి రెండు లేదా మూడు నామినేషన్లు మాత్రమే వైఎస్సార్‌సీపీ తరఫున ఉండేలా చూడాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. నియోజకవర్గంలో మంత్రి పట్టు నిలుపుకోవడానికి ఈ వ్యూహం అమలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్ల తీర్పునకు అవకాశం ఇవ్వకుండా, ఇలా అడ్డదారుల ద్వారా గెలవాలనుకోవడం మంచిది కాదని ప్రజలు మండిపడుతున్నారు.
వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల వ్యాపారాలపై జీఎస్టీ దాడులు
ఉరవకొండ: మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ–జెడ్పీటీసీ అభ్యర్థులను ఎన్నికల బరిలో లేకుండా చేసేందుకు టీడీపీ నేతలు కుట్ర రాజకీయాలకు తెర తీశారు. ఇప్పటికే నామినేషన్లు వేసిన అభ్యర్థులను ప్రత్యక్షంగా, ఫోన్ ద్వారా బెదిరింపులకు గురి చేశారు. తాజాగా జీఎస్టీ అధికారులను ఉసిగొలిపి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల షాపులపై దాడులు చేయించారు. శుక్రవారం ఉరవకొండ–1 ఎంపీటీసీ అభ్యర్థి బెలగల్ షమ్ము, ఉరవకొండ–2 ఎంపీటీసీ అభ్యర్థి పామిడి జాకీర్ వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్లు దాఖలు చేశారు. ఇద్దరూ మైనార్టీ సామాజిక వర్గంలో బలమైన అభ్యర్థులు కావడంతో.. వారు నామినేషన్లు ఉపసంహరించుకునేలా టీడీపీ నేతలు నీచ రాజకీయాలకు ఒడిగట్టారు. ఆర్థికంగా బలహీనపరిచేందుకు వీరికి చెందిన రెండు జ్యువెలరీ షాపులతో పాటు గుంతకల్లు రోడ్డులోని హార్డ్‌వేర్ షాపుపై జీఎస్టీ అధికారులతో దాడులు చేయించారు. పట్టణంలో పదుల సంఖ్యలో జ్యువెలరీ షాపులు, ఇతర వ్యాపార షాపులు ఉన్నా... ఈ మూడు షాపులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేయించటం చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్‌సీపీ నాయకులు ఈడిగ ప్రసాద్, బసవరాజు, ఓబన్న తదితరులు మాట్లాడుతూ తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునేలా మంత్రి ఆదేశాల మేరకే దాడులు అధికారుల ద్వారా దాడులు చేయించారని మండిపడ్డారు. అధికార పార్టీకి ఓటమి భయం పట్టుకుందనేది స్పష్టంగా తెలుస్తోందన్నారు.


