● 450 ఎంపీటీసీ స్థానాలకు 2,450 నామినేషన్లు
● 31 జెడ్పీటీసీ స్థానాలకు 265 నామినేషన్ల దాఖలు
అనంతపురం న్యూ టౌన్: పరిషత్ ఎన్నికలకు సంబంధించి మూడు రోజులుగా సాగిన నామినేషన్ల ఘట్టం శుక్రవారం ముగిసింది. జిల్లాలోని 450 ఎంపీటీసీ స్థానాలకు గాను అన్ని పార్టీలకు సంబంధించి 2,450 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ఇందులో కళ్యాణదుర్గం డివిజన్ పరిధిలోని 183 ఎంపీటీసీ స్థానాలకు 984 మంది నామినేషన్లు వేశారు. ఈ డివిజన్లో అత్యధికంగా కణేకల్లు మండలంలోని 19 ఎంపీటీసీ స్థానాలకు 138 మంది నామినేషన్లు దాఖ లు చేయడం గమనార్హం. అనంతపురం డివిజన్లోని 178 ఎంపీటీసీ స్థానాలకు 959 మంది నామినేషన్లు వేశారు. ఇందులో అత్యధికంగా అనంతపురం రూరల్ పరిధిలో ఉన్న 36 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 199 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇక గుంతకల్లు డివిజన్ సంబంధించి 119 స్థానాలకు మొత్తం 507 మంది నామినేషన్లు వేశారు. ఈ డివిజన్లో అత్యధికంగా 23 ఎంపీటీసీ స్థానాలు ఉన్న ఉరవకొండ బరిలో 107 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలోని 31 జెడ్పీటీసీ స్థానాలకు 265 మంది నామినేషన్లు వేశారు.
నేడు నామినేషన్ల పరిశీలన
పరిషత్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన కార్యక్రమం శనివారం జరగనుంది. జెడ్పీటీసీ నామినేషన్ల పరిశీలన జిల్లా పరిషత్ కార్యాలయం, ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహించనున్నారు. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు.


