అనంతపురం అర్బన్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లతో పాటు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులను అడ్డుకున్నా, భయభ్రాంతులకు గురిచేసినా సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆనంద్ హెచ్చరించారు. ఇలాంటి ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులందరి నామినేషన్లు స్వీకరించాలని ఆర్‌ఓలను ఆదేశించామన్నారు. నామినేషన్ వేసేందుకు వెళుతున్న సమయంలో ఎవరైనా అడ్డంకులు సృష్టించినా, అడ్డుకున్నా సంబంధిత రిటర్నింగ్ అధికారులు, పోలీసు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలని అభ్యర్థులకు సూచించారు. నిర్భయంగా నామినేషన్ దాఖలు చేసేందుకు పోలీసు అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారన్నారు. ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని, అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్ వేసుకోవచ్చన్నారు.


