●వైవీఆర్ కుటుంబ సభ్యుల హౌస్ అరెస్ట్
గుంతకల్లుటౌన్: గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డితో పాటు పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి, యువనాయకుడు మంజునాథరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్‌కు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. టూటౌన్ సీఐ రమేష్‌కుమార్, ఎస్‌ఐ కళ్యాణ్ తమ సిబ్బందితో శుక్రవారం ఉదయాన్నే వైవీఆర్ నివాసానికి చేరుకుని వారిని బయటకు వెళ్లరాదంటూ గృహ నిర్బంధం చేశారు. ఓటమి భయంతోనే అధికార టీడీపీ దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని వైవీఆర్ విమర్శించారు. కూటమి పాలకులు, వారికి వత్తాసు పలుకుతున్న అధికారులంతా ప్రజాగ్రహానికి గురికాకతప్పదని ఆయన హెచ్చరించారు.
●వైఎస్సార్‌సీపీ నాయకుల గృహనిర్బంధం
పామిడి: మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు శుక్రవారం పామిడిలోని వైఎస్సార్‌సీపీ జిల్లా ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి పెమ్మక చెన్నకేశవరెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. ఇదే సమయంలో సీఐ మనోహర్ వచ్చి పెమ్మక చెన్నకేశవరెడ్డితో పాటు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చుక్కలూరు దిలీప్‌రెడ్డి, ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళీనాయక్, జిల్లా నాయకులు బోయ రామచంద్ర, బోయ సూరి, పార్టీ పట్టణ, రూరల్ కన్వీనర్లు నాగూరు ఈశ్వర్‌రెడ్డి, రమావత్ రామకృష్ణనాయక్‌ను గృహ నిర్బంధం చేశారు. అభ్యర్థులపై దాడులు, బెదిరింపులకు పాల్పడుతూ భయానక వాతావరణం సృష్టిస్తున్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అనుచరులు, టీడీపీ మూకలను కట్టడి చేయాల్సిందిపోయి తమను అక్రమంగా నిర్బంధించడం తగదని నాయకులు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడలేని ఈ ఎన్నికలను బాయ్‌కాట్ చేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ నేతలు ప్రకటించారు.


