● వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు విశ్వ
అనంతపురం/ఉరవకొండ: రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో టీడీపీ నేతలు కొనసాగించిన విధ్వంస కాండపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నామని, ఈ తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి చెంప పెట్టు అని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 19 మున్సిపాల్టీల పరిధిలో దారుణమైన హింసా కాండ సృష్టించిన టీడీపీ నేతలు.. తమ పార్టీ సీనియర్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేల వాహనాలపై మారణాయుధాలతో దాడులు చేశారన్నారు. నామి నేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థులపై దాడులు చేసి, మహిళలపైనా దాడులకు తెగబడి ప్రజాస్వామ్యానికి పాతర వేశారన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్, గవర్నర్‌తో పాటు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో తమకు న్యాయం జరిగిందన్నారు.
ఉరవకొండలో మంత్రి కేశవ్ అనుచరుల దౌర్జన్యం.. ఉరవకొండ నియోజకవర్గంలో నామినేషన్ వేయడానికి సిద్ధవుతున్న తమ పార్టీ అభ్యర్థులను మంత్రి కేశవ్ ఆదేశాలతో టీడీపీ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారని విశ్వ అన్నారు. ఉరవకొండ, కూడేరు సీఐలతో అభ్యర్థులకు నేరుగా ఫోన్లు చేయించి, నామినేషన్ వేస్తే అంతు చూస్తాం అంటూ బెదిరింపులకు దిగుతున్నారన్నారు. మంత్రి కేశవ్ స్వగ్రామం కౌకుంట్లలో తమ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులు హనుమంతుతో పాటు మరో అభ్యర్థిని ఉరవకొండ సీఐ మహానంది వారి ఇంటికి వెళ్లి అభ్యర్థుల కళ్లకు గంతలు కట్టి వారిని ఎవరూ గుర్తించని ప్రదేశంలోకి తీసుకెళ్లి దాచారన్నారు. సీఐ స్థాయి వ్యక్తి ఇంతగా దిగజారి మంత్రికి కొమ్ముకాయడం దుర్మార్గమన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలకు కూడా టీడీపీ నేతల దౌర్జ న్యాలు, పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశామన్నారు. ఓటమి భయంతో మంత్రి కేశవ్ కూడా ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లేనని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అశోక్, ఏసీ ఎర్రిస్వామి, ఎర్రిస్వామిరెడ్డి, ధనంజయ పాల్గొన్నారు.


