సూది మందు వికటించి వృద్ధురాలి మృతి | - | Sakshi
Sakshi News home page

సూది మందు వికటించి వృద్ధురాలి మృతి

Oct 19 2026 1:31 AM | Updated on Oct 19 2026 1:31 AM

అనంతపురం సిటీ: ఆర్‌ఎంపీ ఇచ్చిన సూది మందు వికటించి ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు... అనంతపురంలోని సాయినగర్‌ రెండో క్రాస్‌లో నివాసముంటున్న వృద్ధురాలు నరసమ్మ వయోభారం కారణంగా కీళ్ల నొప్పులు, ఆయాసంతో బాధపడుతోంది. ఈ క్రమంలో నొప్పి తీవ్రత భరించలేక ఇబ్బంది పడుతున్న ఆమెను శనివారం ఉదయం పాతూరు తాడిపత్రి బస్టాండ్‌ పరిధిలో ఉన్న మేఘన ప్రథమ చికిత్స కేంద్రానికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆమెకు చికిత్స అందజేసిన ఆర్‌ఎంపీ జి.రమణ.. నొప్పి నివారణ కోసమని ఓ ఇంజెక్షన్‌ వేశాడు. అయితే కొద్ది సేపటి తర్వాత వృద్ధురాలి ఆరోగ్యం విషమించి మృతి చెందింది. ఘటనకు ఆర్‌ఎంపీనే కారణమంటూ శనివారం రాత్రి బాధిత కుటుంబసభ్యులు మేఘన ప్రథమ చికిత్స కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు.

ఆర్‌ఎంపీ కేంద్రం సీజ్‌

విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కట్టా వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు నీరుగంటి వీధిలోని అర్బన్‌ పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ నాగజ్యోతి, జిల్లా మాస్‌ మీడియా అధికారి ఈ.నాగరాజు ఆదివారం రంగంలో దిగారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి ఆర్‌ఎంపీ జి.రమణకు షోకాజ్‌ నోటీసు జారీ చేయడంతో పాటు ప్రథమ చికిత్స కేంద్రాన్ని సీజ్‌ చేయించారు. ప్రథమ చికిత్స కేంద్రమంటూ బోర్డులు పెట్టి అల్లోపతి వైద్యం, గ్లూకోజ్‌, సైలెన్‌ ఎక్కించడం, ఇంజెక్షన్లు, మాత్రలు, స్టెరాయిడ్‌ ఇవ్వడం లాంటి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఆర్‌ఎంపీలపై క్రిమినల్‌ చర్యలకు ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement