విచారణ వద్దు.. వదిలేయండి! | - | Sakshi
Sakshi News home page

విచారణ వద్దు.. వదిలేయండి!

Sep 24 2026 1:54 AM | Updated on Sep 24 2026 1:54 AM

● కళ్యాణదుర్గం సబ్‌రిజిస్ట్రార్‌ను కాపాడేందుకు రంగంలోకి ప్రజాప్రతినిధి

అనంతపురం టౌన్‌: కళ్యాణదుర్గం సబ్‌ రిజిస్ట్రార్‌ రామ్మోహన్‌ అక్రమాలు, నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై ‘సాక్షి’లో ఆధారాల సహితంగా ‘అక్రమాల్లో రిజి‘స్టార్‌’ శీర్షికన బుధవారం వెలువడిన కథనం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో సబ్‌ రిజిస్ట్రార్‌ను కాపాడేందుకు కూటమి పార్టీ ప్రజాప్రతినిధి విశ్వప్రయత్నాలు సాగించినట్లు తెలుస్తోంది. సదరు సబ్‌ రిజిస్ట్రార్‌పై ఎలాంటి విచారణ చేయవద్దంటూ ఓ మంత్రి నుంచి ఆ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయించినట్లు సమాచారం. ‘అవసరమైతే దీర్ఘకాలిక సెలవుపై వెళ్లే విధంగా చూస్తాం.. అప్పటి వరకు చర్యలు వద్దు’ అంటూ హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది.

మాది తప్పు.. ఆయనది ఒప్పా!

నిషేధిత జాబితాలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్‌ చేసిన ఆ శాఖకు చెందిన నలుగురు ఉద్యోగులను ఇటీవల సస్పెండ్‌ చేశారు. వారిలో శింగనమల సబ్‌ రిజిస్ట్రార్‌ గురునాథ్‌, తాడిపత్రి సబ్‌ రిజిస్ట్రార్‌ బసవరాజు, సీనియర్‌ అసిస్టెంట్లు గుత్తి మంజునాథ్‌యాదవ్‌, చెన్నేకొత్తపల్లి అనిల్‌ ఉన్నారు. అయితే, ఇప్పటి వరకు సస్పెన్షన్‌కు గురైన వారి కంటే భారీగా డబ్బు దండుకుని నిషేధిత జాబితాలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్లు చేయడంతో పాటు పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కళ్యాణదుర్గం సబ్‌ రిజిస్ట్రార్‌ను మాత్రం కాపాడేందుకు ప్రజాప్రతినిధి అన్ని రకాల ప్రయత్నాలు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ‘మేము చేస్తే తప్పు.. వారు చేస్తే ఒప్పా?’ అంటూ సస్పెండ్‌కు గురైన అధికారులతోపాటు రిజిస్ట్రేషన్‌ శాఖ ఉద్యోగులు బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. ‘కాపాడేవారు ఉంటే ఎలాంటి పనులైనా చేయొచ్చా’ అంటూ మండిపడుతున్నారు.

కలెక్టర్‌ స్పందించాలి..

కళ్యాణదుర్గం సబ్‌ రిజిస్ట్రార్‌ అక్రమాలు, నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై విచారణ అధికారిగా ఎవరిని నియమించారని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ డీఐజీ విజయలక్ష్మిని వివరణ కోరగా అలాంటిది ఏమీ లేదని సమాధానం ఇవ్వడం గమనార్హం. ఎవరైనా బాధితులు వచ్చి లిఖిత పూర్వకంగా సబ్‌ రిజిస్ట్రార్‌పై ఫిర్యాదు చేస్తే అప్పుడు విచారణ చేపడతామని బదులివ్వడం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ పెద్దల నుంచి రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులకు ఎలాంటి ఆదేశాలు వచ్చాయో దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తోంది. ఏదిఏమైనా కళ్యాణదుర్గం సబ్‌ రిజిస్ట్రార్‌ అక్రమాలపై కలెక్టర్‌ అయినా స్పందించి విచారణకు ఆదేశించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement