అనంతపురం క్రైం: అనంతపురంలో ఇటీవల కురిసిన వర్షాలకు పలుచోట్ల చెట్లు నేల కూలాయి. వీటిని తొలగించే మాటున నగర పాలక అధికారులు, అధికార పార్టీ నేతలు కాసులు కొల్లగొట్టినట్లు తెలిసింది. అంతా ఏకమై నామినేషన్ పనుల పేరుతో కూలిన ఒక్కో చెట్టును తొలగించడానికి సుమారు రూ.లక్ష చొప్పున రెండు రోజుల వ్యవధిలోనే రూ.12 లక్షలకు పైగా ఖర్చు చూపడం చర్చనీయాంశంగా మారింది. ప్రతి వార్డుకు చెత్త ట్రాక్టర్లున్నప్పుడు చెట్ల కొమ్మల తొలగింపునకు ప్రత్యేకంగా బిల్లులు పెట్టడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు.
చేతులు కలిపి.. జేబుల్లోకి వేసుకుని..
నగరపాలక సంస్థలో ఐదు నెలల్లోనే రూ.కోట్ల మేర నామినేషన్ పనులు చేపట్టారన్న ఆరోపణల నేపథ్యంలో తాజాగా కొమ్మల మాటున కాసులు కొల్లగొట్టిన విషయం బయటకు రావడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న కొందరు కాంట్రాక్టర్లు, పార్టీ అనుబంధ వ్యక్తులతో అధికారులు చేతులు కలిపి పర్సెంటేజీలు లెక్కగట్టి నామినేషన్ పనులను అప్పగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పని ఎంత జరిగింది.. వాస్తవంగా ఆ పని అవసరమా.. బిల్లులో చూపిన పరిమాణంలో పని జరిగిందా.. అన్న ప్రశ్నలకు సమాధానాలు అధికారుల వద్ద లేవు. పనుల బిల్లుల పరిశీలన జరిగితే అసలు కథ బయటపడుతుందన్న చర్చ పట్టణంలో జోరుగా సాగుతోంది. ఒకే రకమైన పనులను వివిధ పేర్లతో చూపించడం, ఒక ప్రాంతంలో చేసిన పనిని మరో పేరుతో బిల్లుల్లో నమోదు చేయడం, అవసరం లేని పనులకు సైతం అత్యవసర పనుల ముద్ర వేయడం వంటి విధానాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని పట్టణ ప్రజలు కోరుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నగర పాలక సంస్థలో దోపిడీ పర్వం సాగుతోందనే ఆరోపణలున్నాయి. పలు దఫాలు ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చినా ఏ అధికారి స్పందించలేదు. స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్న కలెక్టర్ అయినా స్పందించి వాస్తవాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది.
ఖర్చుపై స్పష్టత లేదు
వర్షాలు పడిన సమయంలో చెట్ల కొమ్మలు పడిపోయి ఉంటే తొలగించి ఉంటారు. మిగిలిన చెత్తను ఎత్తి ఉంటారు. ఇంత ఖర్చు అని చెప్పలేం. విద్యుత్ శాఖ వాళ్లు చెట్లు కొట్టేసి వాటిని అక్కడే వదిలేస్తారు. మేము వాటిని క్లియర్ చేస్తాం. అలాగని కలపను తెచ్చుకుని వినియోగించుకునే అవకాశం లేదు. ఎంత బిల్లులు పెట్టారన్నది చూసి చెబుతాం.
– షాకీర్, ఇన్‌చార్జ్ ఎస్‌ఈ
ఈ ఏడాది మేలో అనంతపురం నగరంలోని సాయినగర్, విద్యుత్ నగర్ సర్కిల్, గుత్తి రోడ్డు, కొవ్వూరునగర్, లక్ష్మీనగర్ తదితర కాలనీల్లో భారీ వర్షాలకు వృక్షాలు నేల కూలాయి. కూలిన చెట్లను తొలగించేందుకు నగరపాలక సంస్థలో రూ.96 వేల బిల్లు పెట్టడం గమనార్హం.
జూన్‌లో కూడా పలు కాలనీల్లో కురిసిన భారీ వర్షాలకు నేలకూలిన చెట్లను
తొలగించేందుకు రూ.95 వేలు, రూ. 75 వేల మేర బిల్లులు పెట్టారు. నగరంలో ప్రతి వార్డుకు చెత్త సేకరణ ట్రాక్టర్లు ఉన్నప్పుడు
చెట్ల కొమ్మలు తొలగింపునకు ప్రత్యేకంగా ఎందుకు బిల్లులు పెట్టారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
వర్షానికి కూలిన చెట్ల తొలగింపునకు అడ్డగోలుగా బిల్లులు
నామినేషన్ పేరున దందా
అధికారులు కుమ్మక్కయ్యారని సర్వత్రా ఆరోపణలు


