రోడ్డు పక్కకు దూసుకెళ్లిన స్కూల్‌ బస్సు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు పక్కకు దూసుకెళ్లిన స్కూల్‌ బస్సు

Sep 25 2026 2:23 AM | Updated on Sep 25 2026 2:23 AM

● విద్యార్థులకు తప్పిన ప్రమాదం

బుక్కరాయసముద్రం: డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ఓ స్కూల్‌ బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లిన ఘటన మండల పరిధిలో జరిగింది. బస్సులోని 25 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వివరాలు.. బీకేఎస్‌ మండల పరిధిలోని సిద్దరాంపురం నుంచి అనంతపురంలోని అనంతలక్ష్మి ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌కు 25 మంది విద్యార్థులు అదే పాఠశాల బస్సులో బయలుదేరారు. మార్గమధ్యంలోని దేవర కొండ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే క్రమంలో బస్సు డ్రైవర్‌ రవి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బస్సు రోడ్డు పక్కన ఉన్న గుంతల్లోకి దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా బస్సులోని పిల్లలు హాహాకారాలు చేశారు. సమీపంలోని జగనన్న కాలనీవాసులు ఘటనాస్థలికి పరుగున వచ్చి పిల్లలందరినీ బస్సులో నుంచి దించేశారు. విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. విషయాన్ని ఎంఈఓ లింగా నాయక్‌ జిల్లా విద్యాశాఖ అధికారులకు తెలియజేశారు. రోడ్డు రవాణా శాఖ అధికారులు డ్రైవర్‌ రవి డ్రైవింగ్‌ లైసెన్స్‌, బస్సు ఫిట్‌నెస్‌, ఇన్సూరెన్స్‌ తదితర రికార్డులను పరిశీలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రాప్‌ సర్వర్‌.. టెర్రర్‌!

అనంతపురం అగ్రికల్చర్‌: ఖరీఫ్‌ ఈ–క్రాప్‌ ప్రక్రియను సర్వర్‌ సమస్య వెంటాడుతున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. మూడు రోజులుగా ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పరిష్కరించలేని పరిస్థితి నెలకొంది. పగలు రద్దీ ఎక్కువగా ఉంటుందని అర్ధరాత్రి యాప్‌ను ఓపెన్‌ చేస్తున్నా సర్వర్‌ మొరాయిస్తుండడం, ఈ–క్రాప్‌ వేగవంతం చేయాలంటూ పైనుంచి ఒత్తిళ్లు అధికం కావడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈనెల 30లోపు ఈ–క్రాప్‌ పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతానికి 80 శాతం పూర్తయినట్లు చెబుతున్నా... ఈ–కేవైసీ 80 శాతం పెండింగ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. 6.50 లక్షల ఎకరాల వ్యవసాయ పంటలు, మూడు లక్షల ఎకరాల ఉద్యాన పంటలు, మరో 1,300 ఎకరాల మల్బరీతో పాటు 3.40 లక్షల ఎకరాల బీడు భూములు... మొత్తంగా 13 లక్షల ఎకరాల వరకు ఈ–పంటలో నమోదు చేసినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఇంకా 5 లక్షల ఎకరాలకు పైగా నమోదు చేయాల్సి ఉందంటున్నారు.

నీట్‌ పీజీ ఫలితాల్లో అదరగొట్టిన పూజిత

● జాతీయస్థాయిలో 74వ ర్యాంకుతో సత్తా

గుంతకల్లు/ గుంతకల్లు టౌన్‌: నీట్‌–2026 పీజీ పరీక్ష ఫలితాల్లో గుంతకల్లుకు చెందిన డాక్టర్‌ ఎం.పూజిత అదరగొట్టారు. దేశవ్యాప్తంగా మెడికల్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎన్‌బీఈఎంఎస్‌) నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇందులో పూజిత 603 మార్కులతో ఆలిండియా స్థాయిలో 74వ ర్యాంకు సాధించారు. స్థానిక సాయినగర్‌కు చెందిన ఆరోగ్య విస్తరణాధికారి కుమారస్వామి, ఎల్‌ఐసీ ఉద్యోగిని సుగుణమ్మ కుమార్తె పూజిత గత ఏడాది సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు.

5.99 లక్షల మందికి ఆల్బెండజోల్‌

అనంతపురం సిటీ: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న జిల్లా వ్యాప్తంగా బాలబాలికలు 5,99,852 మందికి ఆల్బెండజోల్‌ మాత్ర ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఎన్‌డీడీ నోడల్‌ అధికారి, వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కట్టా వెంకటేశ్వర్లు, ప్రోగ్రాం అధికారులతో గురువారం ఆయన సమీక్షించారు. శిశు సంక్షేమ, మున్సిపాలిటీ, పంచాయతీ రాజ్‌, స్వర్ణ వార్డు సిబ్బందిని సమన్వయం చేసుకుని విజయవంతానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు ప్రసన్న భారతి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement