అనంతపురం అర్బన్: చుక్కల భూముల (డాటెడ్ ల్యాండ్)కు సంబంధించిన చిక్కులు తొలగించేందుకు కసరత్తు మొదలైంది. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్ వేదికగా ప్రత్యేక డ్రైవ్ బుధవారం ప్రారంభమైంది. కలెక్టర్ ఆనంద్ ఆదేశాలతో ఆర్‌డీఓలు, మండల రెవెన్యూ అధికారులు ఫైళ్లను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో చుక్కల భూములకు సంబంధించిన ఫైళ్లు 2,190 వరకు ఉన్నట్లు సమాచారం. తొలిదశలో కనీసం 300 ఫైళ్లను పరిష్కరించాలనే లక్ష్యం విధించినట్లు తెలిసింది. సక్రమంగా ఉన్నవాటికి డాటెడ్ ల్యాండ్ కమిటీ (డీఎల్‌సీ) ద్వారా ఆమోదించి జాబితా నుంచి తొలగిస్తారు.
2,190 ఫైళ్లు పెండింగ్
చుక్కల భూములకు సంబంధించి అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో అత్యధికంగా 1,768 ఫైళ్లు, కళ్యాణదుర్గం డివిజన్‌లో 420 ఫైళ్లు పెండింగ్ ఉన్నాయి. గుంతకల్లు రెవెన్యూ డివిజన్ పరిధిలోని వజ్రకరూరు మండలానికి సంబంధించి రెండు ఫైళ్లు మాత్రమే పెండింగ్ ఉన్నట్లు తెలిసింది. అనంతపురం డివిజన్‌లోని బుక్కరాయసముద్రం, అనంతపురం రూరల్, శింగనమల మండలాలతో పాటు కళ్యాణదుర్గం డివిజన్‌లోని కంబదూరు, కళ్యాణదుర్గం, బెళుగుప్ప మండలాల్లో అత్యధికంగా పెండింగ్ ఉన్నట్లు సమాచారం.
చుక్కల భూమి అంటే...
నిషేధిత భూములు (22ఏ), చుక్కల భూములు (డాటెడ్ ల్యాండ్) రెండు ఒకేరకం కాదు. వీటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అసైన్డ్ చేసిన ప్రభుత్వ భూములు 22ఏ జాబితా కిందకు వస్తాయి. వీటి పరిష్కార అధికారాన్ని కలెక్టర్ల నుంచి ఆర్‌డీఓలకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసింది. ఇక చుక్కల భూములకు సంబంధించి.. ప్రభుత్వ భూమిగా చెప్పబడే భూమి వివరం ఆర్‌ఎస్‌ఆర్ (రీ సెటిల్మెంట్ రిజిస్టర్)లో చుక్కలుగా చూపించి ఉండాలి. ఆ భూమి ఎవరికీ అసైన్డ్ చేసి ఉండకూడదు. ఇలాంటి భూమిని అనుభవించేవారు దరఖాస్తు చేసుకుంటే నిబంధనల మేరకు జాబితా నుంచి తొలగిస్తారు.
ఆమోదముద్రకు నిబంధనలిలా...
● డాటెడ్ ల్యాండ్ చట్టం–2017 ప్రకారం ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న వ్యక్తి చట్టం వచ్చే నాటికి 12 ఏళ్ల ముందు ఆ భూమిపై హక్కు, అనుభవం కలిగి ఉండాలి.
● తహసీల్దారు వద్ద దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై సమగ్ర విచారణ నిర్వహించి ఆర్‌డీఓకు తహసీల్దారు నివేదిస్తారు. దానిని ఆర్‌డీఓ విచారణ చేసి కలెక్టర్‌కు పంపిస్తారు.
● జిల్లాస్థాయి కమిటీ వాటిని విచారణ చేసి జాబితా నుంచి తొలగిస్తారు.


