ఉరవకొండ: పీఏబీఆర్‌కు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ నుంచి ఒక టీఎంసీ నీటిని తరలించి, కుడి కాలువ ద్వారా చెరువులు, వ్యవసాయ భూములకు నీరు అందించే అంశాన్ని ప్రభుత్వం, అధికారులు పరిశీలించాలని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి కోరారు. బుధవారం అనంతపురంలోని తన స్వగృహంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 5 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం ఉన్న జలాశయంలో ప్రస్తుతం 3.70 టీఎంసీల మేర నీరు ఉందన్నారు. ప్రస్తుత నీటి నిల్వను తాగునీటి అవసరాలకు రిజర్వు చేస్తూనే అదనంగా ఒక టీఎంసీ నీటిని తరలించే అవకాశాన్ని సాంకేతికంగా అంచనా వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా 49 చెరువులకు నీరందించేలా పీఏబీఆర్ కుడి కాలువను రూపొందించారన్నారు. జల్లిపల్లి, కూడేరు నుంచి ధర్మవరం కుడి కాలువ పరిధిలోని అనేక ప్రాంతాల్లో సాగునీటి కొరత నెలకొందన్నారు. చీనీ తోటలు, ఇతర ఉద్యాన పంటలకు సాగునీరు అందక రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొందన్నారు.
గేట్ల మరమ్మతులు అత్యవసరం
కుడి కాలువకు నీటిని విడుదల చేసే స్లూయిస్ గేట్లలో సాంకేతిక సమస్యలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారని, గేట్లు సక్రమంగా పనిచేయకపోతే నీటి నియంత్రణలో ఇబ్బందులు తలెత్తడంతో పాటు నీరు వృథా అయ్యే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు నీటి విడుదలకు ముందే గేట్లను సాంకేతికంగా పరిశీలించి అత్యవసరంగా మరమ్మతులు చేపట్టాలన్నారు. నీటి లభ్యత, భవిష్యత్ తాగునీటి అవసరాలు, వర్షపాత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని శాసీ్త్రయంగా నీటి నిర్వహణ చేపట్టాలని కోరారు. ప్రధానంగా తీవ్ర నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుత నీటి నిల్వను తాగునీటి
అవసరాలకే రిజర్వు చేయాలి
నీటి విడుదలకు ముందే గేట్ల
మరమ్మతులు చేపట్టాలి
వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు
విశ్వేశ్వరరెడ్డి


