అత్యవసర సేవలకు దూరం | - | Sakshi
Sakshi News home page

అత్యవసర సేవలకు దూరం

Aug 18 2026 7:22 AM | Updated on Aug 18 2026 7:22 AM

జూనియర్‌ డాక్టర్ల సమ్మె తీవ్రం

అనంతపురం సిటీ: డిమాండ్ల సాధన కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో జూనియర్‌ డాక్టర్లు (జూడాలు), పీజీలు చేపట్టిన సమ్మె తారస్థాయికి చేరింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నుంచి ఎమర్జెన్సీ విధులనూ (అత్యవసర సేవలనూ) బహిష్కరించారు. దీంతో ఒక్కసారిగా వైద్య సేవల్లో గందరగోళం నెలకొంది. 479 మంది జూనియర్‌ డాక్టర్లు, పీజీలు, హౌస్‌ సర్జన్లలో 266 మంది సమ్మెలో పాల్గొంటున్నారు. మిగిలిన 213 మంది అత్యవసర విధుల్లో ఉంటున్నారు. జూడాల సమ్మె నేపథ్యంలోనే సకాలంలో వైద్య సేవలందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడటం కనిపించింది.

స్పందించే వరకు సమ్మెలోనే..

తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేరే వరకూ సమ్మెను విరమించేది లేదని జూనియర్‌ డాక్టర్లు స్పష్టం చేశారు. సోమవారం జీజీహెచ్‌ ఆవరణలో చేపట్టిన ధర్నాలో పలువురు జూనియర్‌ డాక్టర్లు మాట్లాడారు. తాము గొంతెమ్మ కోర్కెలేవీ కోరడం లేదని, 2024 ఎన్నికల సమయంలో కూటమి తరఫున చంద్రబాబు ఇచ్చిన హామీలను మాత్రమే నెరవేర్చాలని అడుగుతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోటా రద్దు చేసి, వైద్య విద్యను మరింత సులభతరం చేయాలని, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలను పూర్తి చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన వసతులు, మెరుగైన స్టైపెండ్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం

అనంతపురం సర్వజనాస్పత్రిలో రోగులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలూ తీసుకున్నామని సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌ మల్లీశ్వరి తెలిపారు. ఇప్పటికే సెలవులో ఉన్న వైద్యులను డ్యూటీలకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఉమ్మడి జిల్లా పరిధి నుంచి 166 మంది వైద్యులను డిప్యూటేషన్‌పై రప్పించామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement