కణేకల్లు : సాగునీటి కోసం అన్నదాతలు పోరుబాట పట్టారు. మండలంలోని కణేకల్లు, 43 ఉడేగోళం, బ్రహ్మాసముద్రం, బెణికల్లు, ఎస్‌ఆర్‌ఎన్ క్యాంపు, కె.మారెంపల్లి తదితర గ్రామాల ఆయకట్టుదారులు సోమవారం హెచ్చెల్సీ సబ్‌డివిజన్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం ధర్నా చేశారు. రైతులు మల్లికార్జున, రామకృష్ణ, నూర్‌బాషా, వన్నూరుస్వామి తదితరులు మాట్లాడుతూ గతంలో టీబీ డ్యామ్‌లో 60 టీఎంసీల నీరున్నా ఆయకట్టుకు సాగునీరిచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం 92 టీఎంసీల నీరున్నా విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు. ఆయకట్టుకు నీరిస్తారని నెల కిందటే బోర్ల కింద వరినారు పోసుకున్నామన్నారు. ప్రస్తుతం నారు ఎండుముఖం పడుతోందని, త్వరగా హెచ్చెల్సీ నీరు వదిలితేనే ఉపయోగముంటుందని అన్నారు. లేకుంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటితో పాటు సాగునీటికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కళ్లెదుట కాలువలో నీరుపారుతున్నా.. ఆయకట్టుకు వినియోగించుకోలేక పోవడంతో భూములు బీడు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలోనైనా నీరిచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా రైతుల ధర్నా గురించి సబ్ డివిజన్ కార్యాలయ సిబ్బంది అధికారులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాగుకు నీరివ్వలేమని.. తాగునీటికే తొలిప్రాధాన్యమని అధికారులు చెప్పిన విషయాన్ని సిబ్బంది రైతులకు తెలిపారు. ఆయకట్టుకు నీరివ్వకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ రైతులు ధర్నా విరమించారు.


