కణేకల్లు: యర్రగుంట గ్రామ శివారులో హెచ్చెల్సీకి 136/800 కిలోమీటర్ వద్దనున్న యూటీ (అండర్ టన్నెల్) పక్కన కాలువ కుడివైపు గట్టుకు సోమవారం చిన్నపాటి రంధ్రం (పైపింగ్) పడి నీళ్లు లీకేజ్ అయ్యాయి. లస్కర్లు గుర్తించి వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కణేకల్లు హెచ్చెల్సీ సబ్‌డివిజన్ డీఈఈ దివాకర్‌రెడ్డి, జేఈ నరేంద్రమారుతి సంఘటన స్థలానికి చేరుకొని పైపింగ్ పడిన ప్రదేశంలో లూజుగా ఉన్న మట్టిని తొలగించి.. లోపల భాగంలో బంకమట్టి వేసి దానిపై ఎర్రమట్టి పరిచి పూడ్చేశారు. సకాలంలో పైపింగ్‌ను గుర్తించడంతో పెద్ద ముప్పు తప్పినట్లైంది. ఎలుకలు బొరియలు పెట్టడంతో నీళ్లు చేరి రంధ్రం పడిందని అధికారులు తెలిపారు. యూటీ, స్ట్రక్చర్ల వద్ద లస్కర్లతో ప్రత్యేక పహారా ఏర్పాటు చేసినట్లు డీఈఈ తెలిపారు.
ఇసుక కొరత రానీయొద్దు
అనంతపురం అర్బన్: జిల్లాలో ఇసుక కొరత రాకుండా తగినంత నిల్వలు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ (డీఎల్‌ఎస్‌సీ) సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అవసరం మేరకు ఇసుక నిల్వలు పెంచుకోవాలన్నారు. డీకాస్టింగ్ పట్టా భూములకు సంబంధించి స్టేట్ క్లియరెన్స్, అనుమతులు తీసుకునేందుకు రెండు ప్రతిపాదనలు ఆమోదించారు. కంబదూరు మండలం నూతిమడుగు గ్రామంలోని ఓపన్ సాండ్ రీచ్‌కు సంబంధించి ఈసీసీఎఫ్ అనుమతులు, తదితర క్లియరెన్స్‌లు పొందేందుకు కమిటీ ఆమోదం తెలిపింది. కర్తనపర్తి ఓపెన్ సాండ్ రీచ్‌కు ఈసీసీఎఫ్‌తో సహా అని రకాల అనుమతులు పూర్తయ్యాయన్నారు. త్వరలో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. సమావేశంలో జేసీ విష్ణుచరణ్, గనుల శాఖ ఏడీ ఆదినారాయణ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ శ్రీనివాసులు, ఇరిగేషన్ ఎస్‌ఈ విశ్వనాథరెడ్డి, భూగర్భజల శాఖ డీడీ గంగాధర్, డీపీఓ నాగరాజునాయుడు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
డి.హీరేహాళ్(బొమ్మనహాళ్): రేషన్ బియ్యం అక్రమ రవాణాను సివిల్ సప్లయీస్ అధికారులు అడ్డుకున్నారు. సోమవారం డీ హీరేహాళ్ మండలంలో సేకరించిన రేషన్ బియ్యాన్ని కర్ణాటకకు తరలించేందుకు ముఠా సభ్యులు ఆంధ్ర–కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో సిద్ధంగా ఉంచారు. పక్కా సమాచారం అందుకున్న సివిల్ సప్లయీస్ అధికారులు దాడులు నిర్వహించి 280 (50 నుంచి 60 కేజీల) బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. బియ్యం నిల్వ చేసిన వారి వివరాలు తెలియరాలేదని, విచారణ అనంతరం కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రాయదుర్గం స్టాక్ పాయింట్‌కు లారీలో తరలించినట్లు చెప్పారు. పేదల కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, ఇతర రాష్ట్రాలకు తరలించడం చట్టవిరుద్ధమన్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుంటామని హెచ్చరించారు.
క్రీడా ప్రతిభా అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం ఎడ్యుకేషన్: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అందజేసే ‘స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్’ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ డాక్టర్ అయూబ్ హుస్సేన్ తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరంలో పాఠశాలల క్రీడా ఫలితాల ఆధారంగా జిల్లాలో ఉత్తమంగా నిలిచిన ఐదు పాఠశాలలకు ‘క్రీడా ప్రతిభా అవార్డులు’ అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, 21న పరిశీలన, 22న అభ్యంతరాల స్వీకరణ, 24న తుది జాబితా ప్రకటన ఉంటుందని తెలిపారు. ఎంపికై న ఐదు పాఠశాలలకు 29న అవార్డులు అందజేస్తామన్నారు. ఇతర వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారి బ్లాగులో పొందుపరిచినట్లు వెల్లడించారు.


