ప్రదక్షిణలేనా.. పరిష్కారం లేదా..? | - | Sakshi
Sakshi News home page

ప్రదక్షిణలేనా.. పరిష్కారం లేదా..?

Aug 18 2026 7:22 AM | Updated on Aug 18 2026 7:22 AM

‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో బాధితుల ఆవేదన

ఈయన పేరు పి.సుఽధీర్‌రెడ్డి అనంతపురం రూరల్‌ మండలం కురుగుంట గ్రామ పొలం సర్వే నంబరు 68 (ఎల్‌పీ 283)లో 16.04 ఎకరాల పట్టా భూమి ఉంది. రీ–సర్వేలో వీరి భూమిని ప్రభుత్వ భూమిగా చూపారు. ప్రభుత్వ భూమి కాదని ఆధారాలతో చూపించి.. సరిచేయాలంటూ అధికారుల చుట్టూ మూడేళ్లుగా తిరుగుతున్నా సమస్యను పరిష్కరించలేదని ఆవేదన చెందాడు. ఆ భూమిని ఇతరుల వద్ద కుదవ పెట్టానని, వారి నుంచి ఒత్తిడి వస్తోందని వాపోయాడు.

పింఛను కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్నానని బుక్కరాయసముద్రం మండలం ఓబుళాపురానికి చెందిన దివ్యాంగుడు కుళ్లాయప్ప ఆవేదన చెందాడు. ఇప్పటికి ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా అధికారులు కనికరించలేదని వాపోయాడు. తాను ఏ పనీ చేసుకోలేనని.. అధికారులు దయతలిచి పింఛను మంజూరు చేస్తే జీవనానికి ఆసరాగా ఉంటుందన్నాడు.

ఈ మహిళ పేరు నన్నీబూ. నార్పల మండలం నడిమిదొడ్డి గ్రామం. సర్వే నంబర్లు 48–2ఎ–1, 50–2ఎ, 50–3ఎ–1, 51–2లో 2.71 ఎకరాల పొలం ఉంది. ఇందుకు ఈ–పట్టాదారు పాసుపుస్తకమూ ఉంది. భూమి సర్వే చేయిస్తే తక్కువగా చూపిస్తున్నారని వాపోయింది. కలెక్టర్‌కు చెప్పుకుని న్యాయం చేయాలని కోరేందుకు వచ్చానని చెప్పింది.

అనంతపురం అర్బన్‌: తాము అధికారుల చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేస్తున్నా.. సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదంటూ బాధితులు గోడు వెల్లబోసుకున్నారు. అర్జీలను పరిశీలించి.. నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌తో పాటు డీఆర్‌ఓ మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్‌, రామ్మోహన్‌, రమేష్‌రెడ్డి, కిరణ్మయి ప్రజల నుంచి 526 అర్జీలను స్వీకరించారు. ఇందులో రెవెన్యూకు సంబంధించి 262 అర్జీలు, ఇతర సమస్యలపై 264 అర్జీలు ఉన్నాయి. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీలను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా వారి సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపించాలన్నారు. అదే విధంగా ప్రతి అర్జీకీ ఎండార్స్‌మెంట్‌ ఇవ్వాలని ఆదేశించారు.

అర్జీల్లో మచ్చుకు కొన్ని..

● పక్కా గృహాలు మంజూరు చేయాలని కంబదూరు మండలం తిప్పేపల్లి గ్రామస్తులు కావలి తిప్పేస్వామి తదితరులు విన్నవించారు. గ్రామంలో ఎరుకల (ఎస్టీ), బోయ (బీసీ) కులానికి చెందిన తాము ఇప్పటికీ గుడిసెల్లోనే జీవనం సాగిస్తున్నామని చెప్పారు.

● గులాబీ మొక్కల కోసం బాలాజీ, రమేష్‌ అనే ఏజెంట్లకు అడ్వాన్స్‌గా డబ్బులు చెల్లించినా వారు మొక్కలు ఇవ్వలేదని అనంతపురం రూరల్‌ మండలం కొడిమి గ్రామానికి చెందిన రైతు లింగమయ్య ఫిర్యాదు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement