● సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన రైతులు
వజ్రకరూరు: హంద్రీ–నీవా కాలువ వెంబడి ఉన్న వ్యవసాయ కనెక్షన్లకు అధికారులు విద్యుత్ సరఫరా బంద్ చేశారు. దీంతో మండలంలోని పొట్టిపాడు, గంజికుంట, తట్రకల్లు, చిన్నహోతూరు, గడేహోతూరు తదితర గ్రామాల రైతులు ఆగ్రహించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సాయంత్రం వజ్రకరూరులోని సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించి రైతులు మాట్లాడారు. హంద్రీ–నీవాకు కృష్ణా జలాలు వస్తాయన్న ఆశతో పంటలు వేసుకున్నామన్నారు. మరోవైపు వర్షాలు లేకపోవడంతో హంద్రీ–నీవా నీటిపైనే ఆధారపడ్డామన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సమాచారం లేకుండా వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా నిలిపివేశారన్నారు. మోటర్లు ఆడకపోతే నీరందక పంటలు ఎండిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనతో వాహనాల రాకపోకలు స్తంభించిపోవడంతో ఎస్‌ఐ నాగస్వామి వచ్చి రైతులతో చర్చించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, న్యాయం జరిగేలా చూస్తామని చెప్పడంతో వారు శాంతించి, ఆందోళన విరమించారు.


