అనంతపురం ఎడ్యుకేషన్: నగర శివారులోని కేఎస్‌ఎన్ మహిళా డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టులకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ కేసీ సత్యలత బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలుగు, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీకాం కంప్యూటర్ అప్లికేషన్, సంస్కృతం సబ్జెక్టులకు సంబంధించి అతిథి అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పూర్తి సమాచారానికి 86395 30636 లో సంప్రదించవచ్చు.
యూరియా నిల్వలపై
విస్తృత తనిఖీలు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా గత 10 రోజులుగా యూరియా కొరత ఏర్పడటంతో రైతులు రోడ్డెక్కుతున్నారు. ఈ విషయంపై ఇటీవల కలెక్టర్ వినోద్‌కుమార్ సీరియస్ అయ్యారు. ఎందుకు సమస్య ఉత్పన్నమైందో రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ క్రమంలో వ్యవసాయశాఖతో పాటు రెవెన్యూ, కార్మిక, పరిశ్రమలు, పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు, పోలీసు తదితర శాఖల అధికారులు బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో తనిఖీలు సాగిస్తున్నారు. వ్యవసాయానికి కాకుండా ఇతరత్రా వాటి తయారీ కోసం ఉపయోగిస్తున్నారా అనే కోణంలో పెయింట్ షాప్స్, డెయిరీలు, లూబ్రికెంట్స్, పీవీసీ పైపులు, సొల్యూషన్ తయారీ కేంద్రాలను పరిశీలించారు. ఇదిలా ఉంటే, జిల్లా నుంచి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు యూరియా వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరికొందరు ముందస్తుగా పెద్ద ఎత్తున నిల్వ చేసుకున్నట్లు కూడా చెబుతున్నారు. మరికొందరు డీలర్లు ఎంఆర్‌పీకి మించి అమ్ముకునేందుకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది.