
అంతర్ జిల్లా టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్
● నేటి నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు
అనంతపురం ఎడ్యుకేషన్: ఒకే యాజమాన్య పాఠశాలల్లో పని చేస్తున్న భార్య,భర్తలు స్పౌజ్ కింద, అలాగే మ్యూచువల్ (పరస్పర బదిలీలు) బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయుడు/హెడ్‌మాస్టర్ ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా వివరాలు, బదిలీ కావాల్సిన జిల్లా వివరాలను డీఎస్సీ ఏపీ ద్వారా ధ్రువీకరించుకోవాలి. ఈ ప్రకారం కొత్త ప్రొఫార్మాలు రూపొందించుకోవాలని పేర్కొన్నారు. వ్యక్తిగత లేదా వైద్య కారణాలపై బదిలీ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపకూడదని స్పష్టం చేశారు. ఈ బదిలీలు జిల్లాల మధ్య మాత్రమే జరుగుతాయని పేర్కొన్నారు. ఒకే యాజమాన్యంలో పని చేస్తున్న వారికి మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో తెలిపారు. 2025 జూలై 31 నాటికి కనీసం రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారు అర్హులు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపల్, మునిసిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో పని చేస్తున్న వారు అదే యాజమాన్యంలో బదిలీకి అర్హులని పేర్కొన్నారు. ఇద్దరు ఉపాధ్యాయుల సమ్మతిపత్రం తప్పనిసరిగా జత చేయాలి.
దరఖాస్తు ఇలా...
లీప్‌యాప్ (ఆన్‌లైన్)లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసిన తర్వాత ప్రింట్ తీసుకుని సంతకం చేసి సంబంధిత హెచ్‌ఎం/ఎంఈఓ/డీవైఈఓకు అందజేయాలి. ఆయా అధికారులు అన్ని సర్టిఫికెట్లు పరిశీలించి నిర్ధారణ చేసి డీఈఓకు నివేదించాలి. ఒకసారి మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త జిల్లాలకు వెళ్లేటప్పుడు సీనియార్టీ కోల్పోతారు. అక్కడ చివరి ర్యాంకులో చేర్చుతారు. ఈనెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 22 నుంచి 25 వరకు హెచ్‌ఎంలు/ఎంఈఓలు/డీవైఈఓలు పరిశీలిస్తారు. 23 నుంచి 26 వరకు డీఈఓ కార్యాలయంలో పరిశీలిస్తారు. 27న పాఠశాల డైరెక్టర్‌కు నివేదిస్తారు. 28,29 తేదీల్లో డైరెక్టర్ కార్యాలయంలో పరిశీలించి నిర్ధారిస్తారు. 30న ప్రభుత్వానికి నివేదించనున్నారు. ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన తర్వాత బదిలీ ఉత్తర్వులు జారీ అవుతాయి.