
తొలి రోజు ఇద్దరు.. రెండో రోజు ముగ్గురు
● జెడ్పీ శిక్షణ తరగతులకు స్పందన కరువు
● అధికారులకూ పట్టని వైనం
అనంతపురం సిటీ: అనంతపురంలోని జెడ్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్న శిక్షణకు మహిళా జెడ్పీటీసీలు, ఎంపీపీల నుంచి స్పందన కరువైంది. మంగళవారం నుంచి గురువారం వరకు మూడు రోజుల పాటు శిక్షణ ఇవ్వాలని జెడ్పీ అధికారులు నిర్ణయించారు. జెడ్పీ క్యాంపస్‌లోని డీపీఆర్‌సీ భవన్‌లో రెసిడెన్షియల్ శిక్షణ తరగతులు ఉంటాయని ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలోని మహిళా ప్రజాప్రతినిధులకు కబురు పంపారు. అందరూ వస్తారని భావించినా తొలి రోజు మంగళవారం కేవలం ఇద్దరు మహిళా జెడ్పీటీసీ సభ్యులు హాజరయ్యారు. బుధవారం ముగ్గురు (ఇద్దరు జెడ్పీటీసీలు, ఒక ఎంపీపీ) మాత్రమే వచ్చారు. శిక్షణ తరగతులకు కనీసం 60 మంది వస్తారని ఊహించి, ఆ మేరకు భోజనాలు తెప్పించారు. అయితే ప్రజాప్రతినిధుల నుంచి స్పందన సరిగా లేకపోవడంతో భోజనాలన్నీ వృథా అయ్యాయి. ఆ వచ్చిన వారు కూడా ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. ఇప్పటికే తమ పదవీ కాలం నాలుగేళ్లు పూర్తి కాగా, మరో ఏడాది కాలం మాత్రమే మిగిలి ఉందని, నాలుగేళ్లుగా లేని శిక్షణ చివరి ఏడాదిలో ఎందుకో అధికారులకే తెలియాలని పేర్కొన్నారు. కేవలం నిధులు వెనక్కి పోకుండా ఖర్చులు చూపించుకోవడానికే కార్యక్రమం ఏర్పాటు చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.