
టోకెన్లు ఇచ్చి ఉత్త చేతులు చూపుతారా?
● యూరియా పంపిణీలో అధికారుల తీరుపై రైతుల ఆగ్రహం
● డీసీఎంఎస్ కార్యాలయానికి తాళాలు వేసి ధర్నా
అనంతపురం డీసీఎంఎస్ కార్యాలయ ప్రధాన గేటు మూసివేసి ధర్నా చేస్తున్న రైతులు
ఒక్క బస్తా యూరియా అయినా ఇవ్వండి సార్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్న మహిళా రైతు ఓబుళమ్మ... నిస్సహాయ స్థితిలో అధికారి
అనంతపురం అగ్రికల్చర్: యూరియా కోసం టోకెన్లు ఇచ్చి ఉత్త చేతులు చూపుతారా అంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కోసం బుధవారం స్థానిక డీసీఎంఎస్ కార్యాలయానికి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 7 గంటలకే బారులు తీరారు. అయితే, అధికారులు మాత్రం స్టాకు లేదంటూ చేతులెత్తేశారు. కనీసం ఒక బస్తా యూరియా అయినా ఇవ్వాలని అనంతపురం రూరల్ మండలం కామారుపల్లికి చెందిన మహిళా రైతు ఓబుళమ్మ కన్నీళ్లు పెట్టుకున్నా స్టాకు లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో కడుపు మండిన రైతులు నిరసనకు దిగారు. ఎరువులు అమ్మే ఇంత పెద్ద ఆఫీసుకే యూరియా తెప్పించకపోవడమేమిటంటూ బీఎం విజయభాస్కర్, ఏబీఎం సత్యనారాయణరెడ్డి, ఏఓ సుధాకర్‌రెడ్డిని నిలదీశారు. అధికారులు, సిబ్బందిని బయటకు పంపి కార్యాలయానికి తాళాలు వేశారు. అనంతరం ప్రధాన గేటు ముందు ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న మండల వ్యవసాయ అధికారి వెంకటకుమార్ అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడారు. టోకెన్లు ఇచ్చిన వారికి యూరియా ఇస్తామని, గురువారం నుంచి ఎక్కడిక్కడ రైతు సేవా కేంద్రాలకు యూరియా సరఫరా అవుతున్నందున, ఇక్కడకు రావాల్సిన అవసరం లేదని నచ్చజెప్పారు. కలెక్టర్, జేడీఏ ఆదేశాల మేరకు మండలాల్లోనే ఒక ఆర్‌ఎస్‌కేకు యూరియా సరఫరా చేస్తారని, సంబంధిత మండల వ్యవసాయ అధికారిని సంప్రదిస్తే యూరియా అందేలా చూస్తారన్నారు. అనంతపురం రూరల్‌కు సంబంధించి నారాయణపురంలో తీసుకోవచ్చన్నారు. దీంతో రెండు గంటల తర్వాత రైతులు నిరసన కార్యక్రమాన్ని విరమించారు.

టోకెన్లు ఇచ్చి ఉత్త చేతులు చూపుతారా?