
హడలెత్తుతున్న సబ్ రిజిస్ట్రార్లు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘పచ్చ’ నేతల దెబ్బకు ఉమ్మడి జిల్లాలో సబ్ రిజిస్ట్రార్లు బెంబేలెత్తుతున్నారు. అసలే రిజిస్ట్రేషన్ ఆదాయం పడిపోయి అల్లాడుతుండగా తాజాగా ఎమ్మెల్యేల ఒత్తిడి ఎక్కువైపోయిందంటూ వాపోతున్నారు. తాము చెప్పినట్టు రిజిస్ట్రేషన్లు చెయ్యకపోతే శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పెద్ద రిజిస్ట్రేషన్లు తమకు తెలియ కుండా చేయకూడదని చెబుతున్నారు.
పర్సెంటేజీలు ముట్టజెబితేనే..
ఎక్కడైనా కొద్దో గొప్పో బిల్డర్లు స్థలాలు లేదా భూములు కొని రిజిస్ట్రేషన్‌కు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. కోటి రూపాయలకు మించి ఎలాంటి రిజిస్ట్రేషన్ వచ్చినా ముందుగా ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వాలి. స్వయంగా కొన్ని చోట్ల సబ్‌రిజిస్ట్రార్‌లే ‘ఎమ్మెల్యేను కలిసి రండి’ అని కొనుగోలుదారుడికి చెబుతున్నారంటే పరిస్థితి అంచనా వేయొచ్చు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి. మున్సిపాలిటీల పరిధిలో పెద్ద పెద్ద భవనాలకు రిజిస్ట్రేషన్లు జరగాలన్నా ఎమ్మెల్యేల అనుమతి ఉండాల్సిందేనని సబ్‌రిజిస్ట్రార్లు చెబుతున్నారు.
అక్కడ భారీగా ఒత్తిళ్లు..
అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ప్రధానంగా కొన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులపై తీవ్ర ఒత్తిడి ఉన్నట్టు వాపోతున్నారు. అనంతపురం అర్బన్, అనంతపురం రూరల్,కదిరి,కళ్యాణదుర్గం, రాప్తాడు, తాడిపత్రి ప్రాంతాల్లో ఎక్కువ ఇబ్బందులున్నట్టు చెబుతున్నారు. కొన్ని చోట్ల ఒక సారి రిజిస్ట్రేషన్ అయిన భూములను కూడా రెండో సారి చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ఒత్తిళ్ల కారణంగానే ఇటీవల అనంతపురం నగరంలో ‘అస్రా’ కంటి అద్దాల షాపు రిజిస్ట్రేషన్ రెండో సారి జరిగినట్టు తెలిసింది.
కదిరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అంతా అడ్డగోలుగా..
కదిరిలో ముడుపులు లేనిదే ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగడం లేదు. విచిత్రమేమంటే పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించిన మూడు మండలాలు కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోకి వస్తాయి. కానీ ఈ మూడు మండలాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి పుట్టపర్తి ఎమ్మెల్యే చెప్పినట్టు జరగడం లేదు. కదిరి ఎమ్మెల్యే చెబితేనే పనవుతుందని అక్కడి టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ధర్మవరం, శింగనమల నియోజకవర్గాల్లోనూ ఖరీదైన భూములైతే ప్రజాప్రతినిధుల చేయి తడిపాకే పనవుతోంది. లేదంటే సబ్‌రిజిస్ట్రార్ కొర్రీలేసి జాప్యం చేస్తున్నారు. ఎమ్మెల్యేల ఒత్తిడి కారణంగా సబ్‌రిజిస్ట్రార్లు కూడా వినియోగదారుల నుంచి పిండుకుంటున్నారు. దీంతోనే ఏడాదిలో ఒక్క సబ్ రిజిస్ట్రార్ అయినా ఏసీబీకి పట్టుబడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఎమ్మెల్యేల ఒత్తిడి ఉన్నట్టు సబ్‌రిజిస్ట్రార్లు చెబుతుండడం గమనార్హం.
చెప్పింది చెయ్యకపోతే బదిలీపై
వెళ్లిపోతారంటూ ఎమ్మెల్యేల హెచ్చరికలు
పెద్ద రిజిస్ట్రేషన్ వస్తే తమకు తెలియజేయాలని హుకుం
ప్రతినెలా మామూళ్లివ్వాలని
కొంతమంది ఎమ్మెల్యేల అల్టిమేటం
విలవిలలాడుతున్న సబ్‌రిజిస్ట్రార్లు