
చీనీలో సమగ్ర యాజమాన్యం
బుక్కరాయసముద్రం: చీనీ సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చునని రైతులకు రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ మాధవి తెలిపారు. గత ఏడాది టన్ను చీనీ ధర రూ. 90 లక్షలు నుంచి రూ.1.10 లక్షల వరకూ పలికింది. ప్రస్తుతం మార్కెట్‌లో టన్ను రూ.25 వేలతో అమ్ముడుపోతోంది. ఈ నేపథ్యంలో చీనీ సాగులో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించేందుకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులను ‘సాక్షి’కి ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ మాధవి వివరించారు.
● చీనీ సాగులో ప్రధానంగా మొక్క ఎంపిక చాలా ముఖ్యం. మొక్క ఎంపిక సరైనది కాకపోయినా, సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించకపోయినా, విపరీతంగా రసాయనిక మందులు వినియోగించినా, సూక్ష్మ పోషకాలు లోపించినా, సరైన నీటి యాజమాన్యం లేకపోయినా వేరు కుళ్లు, బంక తెగుళ్లు, నల్ల మంగు తదితర చీడ పీడలు ఆశించే అవకాశముంది.
● రంగాపూర్ నిమ్మ వేరు మీద 15 సెంటీమీటర్ల ఎత్తులో అంటు కట్టి, చీడపీడలు ఆశించని 6 నెలల వయసున్న మొక్కలు ఆమోదం పొందిన నర్సరీ నుంచి సేకరించుకోవాలి. 1 మీటరు లోతు గుంత తీసి 20 కిలోల పశువుల ఎరువు, 100 గ్రాముల ట్రెకోడెర్మా విరిడి, 2 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పెట్, 100 గ్రాముల మిథైల్ ఫెరాథియాన్ కలిపి మొక్క నాటడానికి 15 రోజుల ముందు వేసి నీరు పెట్టాలి. నేల మట్టం నుంచి 15 సెంటీ మీటర్లు ఎత్తులో అంటు కలయిక భాగం ఉండేలా నాటుకోవాలి.
● నేలలో కర్బన శాతాన్ని పెంచడానికి 25 కిలోల జనుమును మొక్కల మధ్య అంతర పంటగా వేయాలి. 50 శాతం పూత వచ్చిన తరువాత జనుమును కలియ దున్నాలి. 25 శాతం పశువుల ఎరువు, 25 శాతం చెక్క, 50 శాతం సేంద్రీయ ఎరువులను వేయాలి. నత్రజని, పొటాష్ ఎరువులను రెండు దఫాలుగా వేసుకోవాలి. కాయ పెరిగే సమయంలో వేసుకున్నట్లయితే మొక్కకు పోషకాలు పెరిగి మంచి దిగుబడి సాధించవచ్చు. 500 గ్రాముల యూరియా, 250 గ్రాముల మ్యారేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవడం ఎంతో మంచిది.
● లేత ఆకులు విచ్చుకున్న దశలో 15 నుంచి 20 రోజుల వ్యవధిలో రెండు సార్లు సూక్ష్మధాతు మిశ్రమాన్ని పిచికారీ చేయాల్సి ఉంటుంది. జింక్ సల్ఫేటు 500 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేటు 200 గ్రాములు, ఫెర్రస్ సల్ఫేటు 200 గ్రాములు, బోరాన్ 100 గ్రాములు, యూరియా 1కిలో చొప్పున 100 లీటర్లు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
● పూత, పిందె దశలో ఉన్నప్పుడు వేర్లు ఉన్న ప్రాంతాన్ని కదిలించరాదు. డ్రిప్పు ద్వారా నీటి తడులను సక్రమంగా ఇవ్వాలి. 9 లీటర్ల నీటికి 2 మి.లీ. ప్లానాఫిక్స్ కలిపి పూత, పిందె దశలో పిచికారీ చేయాలి. ఒకవేళ తెగుళ్ల వలన పిందె రాలుతుంటే లీటరు నీటికి కార్బండజిమ్ 1 గ్రాము కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
● కాయ సైజు పెరగడానికి నిమ్మ కాయ సైజులో ఉన్నప్పుడు లీటరు నీటికి 10 గ్రాములు చొప్పున పొటాషియం నైట్రేట్ 13.0.45 కలిపి 20 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. కాయలో నునుపుదనాన్ని పెంచడానికి లీటరు నీటికి 5 గ్రాముల సల్ఫేటు ఆఫ్ పొటాష్ కలిపి కాయ కోయడానికి నెల రోజుల ముందు పిచికారీ చేయాలి.

చీనీలో సమగ్ర యాజమాన్యం