
నిధుల్లేక నిస్తేజం!
● ఆగిన 15వ ఆర్థిక సంఘం నిధులు
● ఏడాదిగా కుంటుపడిన పల్లె పాలన
రాయదుర్గం: నిధుల్లేక గ్రామ పంచాయతీలు నిస్తేజంలో పడ్డాయి. ఐదు నెలలుగా పైసా జమ కాకపోవడంతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 15వ ఆర్థిక సంఘం నిధుల ఊసే లేకపోవడంతో సర్పంచులు పారిశుధ్య పనులకే పరిమితమవుతున్నారు. వీటికి సైతం సొంత డబ్బు వెచ్చించాల్సి వస్తోందని వాపోతున్నారు.
ఎదురుచూపునకే పరిమితం
జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు ఈ ఏడాది మార్చి 31 తర్వాత ఆగిపోయాయి. ఈ లెక్కన 577 పంచాయతీలకు రూ.30 కోట్లకు పైగా నిధులు జమకావాల్సి ఉంది. నిధులు జమకాక, పనులు చేపట్టక సర్పంచులు సతమతమవుతున్నారు. 90 శాతం గ్రామ పంచాయతీలకు గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే సర్పంచులుగా గెలుపొందారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అడుగడుగునా సర్పంచులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్నీ పంచాయతీల్లోనూ కూటమి నాయకులే అధిపత్యం చెలాయిస్తుండడంతో సొంతంగా ఏ పని చేయలేని దుస్థితిలో ఉంటున్నారు.
పన్నులపైనే ఆధారం
గ్రామ జనాభా ఆధారంగా ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతి నెలా ఎస్‌ఎఫ్‌సీ నిధులతో పాటు మూడు నెలలకోసారి 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం సమకూరుస్తూ ఉంటుంది. జిల్లాలోని 577 గ్రామ పంచాయతీల్లో 3.90 లక్షల గృహాలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీ పారిశుధ్యం, వీధిదీపాలు, తాగునీటి పథకాల మోటార్ల మరమ్మతులు, బ్లీచింగ్ పౌడర్, ట్రాక్టర్ నిర్వహణ, గ్రీన్ అంబాసిడర్ల వేతనాలు తదితరాల ఖర్చులు పంచాయతీలే భరిస్తున్నాయి. అయితే 15 ఆర్థిక సంఘం నిధులు అందక ఇంటి పన్ను, కొళాయి పన్నులపైనే ఆధారపడాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.18.8 కోట్లు ఇంటి పన్ను లక్ష్యం కాగా, ఇప్పటి వరకూ రూ.15.3 కోట్లు వసూలైంది. మరో రూ.3.5 కోట్లు వసూలు కావాల్సి ఉంది.
తాండవిస్తున్న పారిశుధ్యం
జిల్లాలో కురుస్తున్న వర్షాలకు గ్రామాల్లో అపరిశుభ్రత పేరుకుపోతోంది. తడి ఆరక వీధులన్నీ బురదమయంగా మారాయి. కాలు ఎక్కడ పెట్టాలో తెలియని స్థితిలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దోమలు దండయాత్ర చేస్తున్నాయి. ఖజనాలో డబ్బుల్లేక సర్పంచులు సొంత డబ్బును వెచ్చించాల్సి వస్తోంది.

నిధుల్లేక నిస్తేజం!