కళ్యాణదుర్గం రూరల్: పట్టణ శివారులోని అక్కమాంబ కొండపై టీడీపీ నేతల కన్ను పడింది. ఏకంగా కొండను తవ్వి ఎర్ర మట్టిని టిప్పర్లు, ట్రాక్టర్లతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. టిప్పర్ మట్టిని డిమాండ్‌ను బట్టి రూ.3వేల నుంచి రూ.4వేలకు తరలిస్తున్నారు. ఈ అక్రమ దందా రాత్రి సమయంలో జోరుగా సాగుతోంది. టీడీపీ నేతలే అక్రమాలకు తెరలేపడంతో అటుగా అధికారులు సైతం కన్నెత్తి చూడడం లేదు. ఫలితంగా అక్కమాంబ కొండ కరిగిపోతోంది. దీనిపై తహసీల్దార్ భాస్కర్‌ను వివరణ కోరగా... ప్రభుత్వ స్థలాలు, కొండ ప్రాంతాల్లో అక్రమంగా తవ్వకాలు చేపట్టి మట్టిని తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. క్రిమినల్ కేసు నమోదు చేయడమే కాక, వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
నూతన మూల్యాంకన విధానం వద్దు : ఏపీటీఎఫ్
అనంతపురం ఎడ్యుకేషన్: పాఠశాల విద్య పరీక్షల నిర్వహణలో తీసుకొచ్చిన నూతన మూల్యంకన విధానాన్ని రద్దు చేయాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం డీఈఓ ప్రసాద్‌బాబును కలిసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మూల్యాంకన విధానం బోధన సమయాన్ని హరించేలా ఉందన్నారు. దీంతో విద్యార్థులు నష్టపోయే ప్రమాదముందన్నారు. అసెస్మెంట్ బుక్లెట్ విధానాన్ని ఉపసంహరించుకొని సాధారణ మూల్యాంకన విధానాన్నే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే చాలామంది ఉపాధ్యాయులకు జూన్, జూలై మాసాల జీతాలు ఇప్పటికీ అందలేదని, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. డీఈఓను కలసిన వారిలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాయల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి ఎస్.సిరాజుద్దీన్, నాయకులు నరసింహులు, సర్దార్ వలి, వెంకటరమణ, వన్నప్ప, ఈజీ నాగభూషణం, రంగనాయకులు, పుల్లయ్య ఉన్నారు.
ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు
అనంతపురం ఎడ్యుకేషన్: నగరంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తు గడువు పొడిగించారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ రాయపరెడ్డి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 26వ తేదీ లోపు https://iti.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు అనంతరం 27వ తేదీ ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్‌కు హాజరు కావాలి. 29న కౌన్సెలింగ్ ఉంటుంది. పూర్తి వివరాలకు పని వేళల్లో ఐటీఐ కార్యాలయంలో సంప్రదించవచ్చు.
కరిగిపోతున్న అక్కమాంబ కొండ