
మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దండి
పుట్టపర్తి అర్బన్: మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (సెర్ప్) సీఈఓ వాకాటి కరుణ ఆదేశించారు. వెలుగు కార్యాక్రమాలపై బుధవారం పుట్టపర్తిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఉమ్మడి జిల్లా వెలుగు సిబ్బందితో ఆమె సమీక్షించారు. మహిళా సాధికారతకు కృషి చేయాలని, మహిళా సంఘాల్లో లెక్కల్లో కచ్చితత్వం ఉండేలా కృషి చేయాలని సూచించారు. మహిళల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి, వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలన్నారు. పీఎంఈజీపీ, పీఎంఎఫ్‌ఎంఈ తో పాటు ఇతర రుణాలు అందించి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో ఉన్నతి హెచ్‌డీ డైరెక్టర్ శివశంకరప్రసాద్, డీఆర్‌డీఏ పీడీలు నరసయ్య, శైలజ, ఉమ్మడి జిల్లా డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు. అంతకు ముందు ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం శాంతి భవన్‌లో కలెక్టర్ చేతన్‌ను కలసి పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. జిల్లా విషయాలపై సుమారు గంట పాటు చర్చించారు.
వినియోగదారులతో స్నేహపూర్వకంగా మెలగాలి
● విద్యుత్ శాఖ సీఎండీ సంతోష్‌రావు
అనంతపురం టౌన్: విద్యుత్ వినియోగదారులతో స్నేహపూర్వకంగా మెలగినప్పుడే అనుకున్న లక్ష్యానికి చేరువ అవుతామని ఆ శాఖ సీఎండీ సంతోష్‌రావు అన్నారు. విద్యుత్ వినియోగదారులతో ఎలా మెలగాలనే అంశంపై జేఎన్‌టీయూ ఆడిటోరియంలో బుధవారం ఆ శాఖ అధికారులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యుత్ వినియోగదారులకు సకాలంలో సేవలు అందించి వారి నుంచి రెవెన్యూ రాబట్టేందుకు కృషి చేయాలన్నారు. ప్రస్తుత వర్షకాలంలో వినియోగదారులు ఫోన్ చేసిన వెంటనే స్పందించి, విద్యుత్ అంతరాయం లేకుండా సేవలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీజీఎం వరకుమార్, ఎస్‌ఈ శేషాద్రి శేఖర్‌తోపాటు పలువురు విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.
రాయలసీమ కవితా పోటీలు
అనంతపురం కల్చరల్: రాయలసీమ సమాజం, జీవనం, సంస్కృతి నేపథ్యంగా దీర్ఘ కవితల పోటీలు నిర్వహిస్తున్నట్లు రాయలసీమ సాంస్కృతిక వేదిక సమన్వయకర్త డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి తెలిపారు. తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి స్మారకంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పాల్గొనే ఆసక్తి ఉన్న వారు నవంబరు 1వ తేదీలోపు తమ కవితలను పంపాలని కోరారు. విజేతకు రూ.15 వేల నగదు పురస్కారాన్ని అందజేయనున్నామన్నారు. పూర్తి వివరాలకు 99639 17187 లో సంప్రదించాలని కోరారు.