అంబేడ్కర్ కాలనీ నేమ్‌బోర్డు ఏర్పాటుపై ఉద్రిక్తత
రాయదుర్గం టౌన్: మండలంలోని రాయంపల్లి ఎస్సీ కాలనీ ప్రవేశ మార్గంలో ‘అంబేడ్కర్ కాలనీ’ నేమ్ బోర్డు ఏర్పాటుపై సోమవారం ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన కొందరు కూటమి నాయకులు నేమ్‌బోర్డును దౌర్జన్యంగా పెకలించారు. ఆ సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. జిల్లా కలెక్టర్‌గా గంధం చంద్రుడు పనిచేసిన సమయంలో దళిత, ఎస్సీ కాలనీలను ఆ పేర్లతో పిలవకూడదన్న ఉద్దేశంతో జాతీయ నాయకుల పేర్లతో నేమ్ బోర్డులు ఏర్పాటు చేయించారు. ఈ నేపథ్యంలోనే రాయంపల్లి ఎస్సీ కాలనీకి ‘అంబేడ్కర్ కాలనీ’గా నామకరణం చేసి నేమ్‌బోర్డు ఏర్పాటు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు బోర్డు పడిపోవడంతో కొందరు యువకులు మరమ్మతు చేయించి.. అంబేడ్కర్ జయంతి రోజున అదే స్థలంలో మళ్లీ ఏర్పాటు చేశారు. దీనిని జీర్ణించుకోలేని గ్రామానికి చెందిన కొందరు కూటమి నాయకులు దళితులతో ఘర్షణకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని గొడవను సద్దుమణిగించారు. కాగా, ‘అంబేడ్కర్ కాలనీ’ నేమ్‌బోర్డు ఏర్పాటు చేస్తే అంతు చూస్తామంటూ కులం పేరుతో దూషించి న కూటమి పార్టీల నాయకులు శీనప్ప, మద్దానప్ప, హనుమంతప్ప, జయన్న, ఆంజనేయులు, బోయ దొడ్డపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు దళితులు ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తిప్పేరుద్ర, వన్నూరుస్వామి, కిష్టప్ప, రుద్రన్నతో పాటు మరో 12 మంది డిమాండ్ చేశారు.


