వ్యక్తి దుర్మరణం
బెళుగుప్ప: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు తెలిపిన మేరకు.. బోరంపల్లికి చెందిన బొజ్జప్ప (45) బుధవారం యర్రగుడి గ్రామంలో జరిగిన దేవరకు వచ్చి, మొక్కు తీర్చుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో ఎదురుగా ద్విచక్రవాహనంపై వేగంగా వస్తున్న ముదిగల్లుకు చెందిన దేవ అనే వ్యక్తి ఢీకొనడంతో రోడ్డుపై పడి బొజ్జప్ప అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన దేవాను స్థానికులు వెంటనే కళ్యాణదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి చేర్చారు.
శ్రామికులకు గిట్టుబాటు
కూలి : డ్వామా పీడీ
గార్లదిన్నె: ఉపాధి పనుల్లో పాల్గొనే శ్రామికులకు రోజు వారీ కూలి రూ.307 అందేలా చొరవ తీసుకోవాలని క్షేత్ర సహాయకులకు డ్వామా పీడీ సలీంబాషా సూచించారు. గార్లదిన్నె మండలం పి.కొత్తపల్లి, సంజీవపురం గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించి, ఉపాధి హామీ పథకం కింద రైతులు నిర్మించుకున్న పశువుల షెడ్డులు, ఎరువు గుంతలు, సోక్ పిట్ నిర్మాణ పనులు పరిశీలించారు. అనంతరం గార్లదిన్నె ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి సిబ్బందితో సమావేశమై పనుల కల్పన అంశంపై సమీక్షించారు. కార్యక్రమంలో ఈసీ అయూబ్, టీఏ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
చెట్టు మీద నుంచి జారి పడి వ్యక్తి మృతి
వజ్రకరూరు: ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కింద పడి వజ్రకరూరు మండలం ఎన్‌ఎన్‌పీ తండా నివాసి రమావత్ శంకర్‌నాయక్ (40) మృతి చెందాడు. ఆయనకు భార్య పార్వతి, ఓ కుమారుడు ఉన్నారు. వ్యవసాయ కూలి పనులతో పాటు జీవాల పోషణతో జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం మేకలకు ఆహారం కోసమని ఇంటి వద్ద వేపచెట్టు ఎక్కి ఆకులు కోస్తుండగా అదుపు తప్పి కిందపడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే 108 వాహనంలో గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. అక్కడ చికిత్సకు స్పందించక బుధవారం ఉదయం మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వ్యక్తి దుర్మరణం


