పత్తి రైతులకు తప్పని తిప్పలు
గుత్తి: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో భారత పత్తి సంస్థ (సీసీఐ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు తిప్పలు తప్పడం లేదు. వారంలో కేవలం బుధవారం ఒక్క రోజే పత్తి కొనుగోలు చేపడుతుండడంతో రైతులు తెల్లవారు జామున నాలుగు గంటలకే పత్తి వాహనాలతో బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో చలి తీవ్రత తాళలేక గజగజ వణికి పోతున్నారు. వారంలో కనీసం రెండు రోజులైనా పత్తిని కొనుగోలు చేయాలని రైతులు కోరారు.
‘పరీక్షా పే చర్చకు
దరఖాస్తు చేసుకోండి’
అనంతపురం సిటీ: ప్రధానిని ప్రత్యక్షంగా కలుసుకుని నేరుగా మాట్లాడే సువర్ణావకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోందని ఇన్‌చార్జ్ డీఈఓ పాటిల్ మల్లారెడ్డి, సమగ్రశిక్ష ఏపీసీ టి.శైలజ తెలిపారు. ఈ మేరకు బుధవారం వేర్వేరుగా ప్రకటించారు. పరీక్షలపై భయం పోగొట్టి, ఒత్తిడి తగ్గించి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు జాతీయ స్థాయిలో పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహిస్తోంది. తొమ్మిదో విడత జనవరి 2026 లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 6 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అర్హులు. జనవరి 11వ తేదీలోపు https://innov ateindia.mygov.in/ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విజేతలకు ప్రధానితో నేరుగా మాట్లాడే అవకాశం కల్పిస్తారు. అక్కడే ప్రశంసాపత్రాలు, ఎగ్జామ్ వారియర్స్ కిట్‌లను బహుమతిగా అందజేస్తారు.
రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా గుడి బండయ్య
ఉరవకొండ: స్థానిక తొగటవీర క్షత్రియ కల్యాణ మంటపం వేదికగా బుధవారం జిల్లా రేషన్ షాపు డీలర్ల సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న డీలర్లు తరలివచ్చారు. జిల్లా అధ్యక్షుడిగా ఉరవకొండ డీలర్ గుడి బండయ్య, ఉపాధ్యక్షుడిగా బోయ రాము (అనంతపురం), ప్రధాన కార్యదర్శిగా భరత్‌చౌదరి (రాప్తాడు), ఉప కార్యదర్శిగా బసవరాజు (కళ్యాణదుర్గం), కోశాధికారిగా రంగనాయకులు (తాడిపత్రి), డైరెక్టర్లుగా బాలు (గుంతకల్లు), శివ (శింగనమల), వీరన్నగౌడ్ (గుంతకల్లు), సత్య (రాయదుర్గం) ఎన్నికయ్యారు.
సెలవులో డీఈఓ
అనంతపురం సిటీ: జిల్లా విద్యా శాఖాధికారి ప్రసాద్‌బాబు బుధవారం నుంచి ఆదివారం వరకు ఐదు రోజుల పాటు ఆయన సెలవులో వెళ్లారు. సోమవారం ఆయన విధులకు హాజరుకానున్న నేపథ్యంలో అప్పటి వరకూ ఇన్‌చార్జ్ డీఈఓగా గుత్తి డిప్యూటీ డీఈఓ మల్లారెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
పత్తి రైతులకు తప్పని తిప్పలు


