నెలలుగా వేతనాలు ఇవ్వకుంటే పస్తులుండాలా?
● ప్రభుత్వంపై పంచాయతీ కార్మిక నాయకుల ధ్వజం
● కలెక్టరేట్ ఎదుట ధర్నా
అనంతపురం అర్బన్: ‘మీ రుణం ఏమిచ్చినా తీర్చుకోలేమంటూ ప్రజాప్రతినిధులు పొగుడుతారు. శాలువా కప్పి సన్మానం చేస్తారు. అయితే ఏమి ప్రయోజనం నెలలుగా వేతనాలు చెల్లించకపోతే తాము గడ్డి తిని బతకాలా?( అంటూ ప్రభుత్వం, అధికారులపై పంచాయతీ పారిశధ్య కార్మికులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతి నెలా చెల్లిస్తున్న వేతనాన్ని రూ.21 వేలుకు పెంచడంతో పాటు బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలంటూ ఏపీ గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల సంఘం ఆధ్వర్యంలో నాయకులు, కార్మికులు సోమవారం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి మూకుడులో గడ్డి పెట్టుకుని ధర్నా చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు హెచ్.మధు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌వీనాయుడు, నాగేంద్రకుమార్, పంచాయతీ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు గోపాల్, ప్రధాన కార్యదర్శి శివప్రసాద్ మాట్లాడారు. పంచాయతీ కార్మికులకు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు పంచాయతీలో కార్మికులకు ఎనిమిది నెలల వేతనం బకాయి ఉండడం సిగ్గుచేటన్నారు. రాప్తాడు, రుద్రంపేట, అనంతపురం రూరల్, బుక్కరాయసముద్రం, ఆత్మకూరు, కల్లూరు, కొనకొండ, రాజీవ్‌కాలనీ, కక్కలపల్లి కాలనీ, తదితర పంచాయతీల్లో కార్మికులకు నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన కార్మికులు కుటుంబాన్ని పోషించుకోలేక అప్పుల పాలవుతున్నారన్నారు. పెరిగిన ధరలతో పోలిస్తే వారికి ఇచ్చే వేతనం చాలా తక్కువని, మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తున్న విధంగానే పంచాయతీ కార్మికులకూ రూ.21 వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.పంచాయతీ కార్మికులకు పీఎఫ్ అమలు, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలన్నారు. అనంతరం ధర్నా వద్దకు వచ్చిన జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడుకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ ఉపాధ్యక్షుడు రామాంజనేయులు, నగర అధ్యక్షుడు వెంకటనారాయణ, కోశాధికారి శ్రీనివాసులు, నాయకులు ఆజామ్ బాషా, నూర్‌బాషా, వీరాంజనేయులు, మూర్తి, బాలాజీనాయక్, రామకృష్ణ, సంధ్యాబాయి, నల్లప్ప, కుళ్లాయమ్మ, తదితరులు పాల్గొన్నారు.


